మా నాన్న ఉన్నా లేనట్టే.. డబ్బుల కోసం చిత్రహింసలు.. బుల్లితెర యాంకర్ భావోద్వేగం
బుల్లితెరపై చిరునవ్వుతో ప్రేక్షకులను అలరించే యాంకర్ సౌమ్య రావు (Sowmya Rao). ఈ కన్నడ బ్యూటీ జబర్దస్త్ కు యాంకర్ గా చేసింది. వచ్చి రాని తెలుగుతో ఈ అమ్మడు ముద్దుముద్దుగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ చిన్నది జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయాగా.. ఇతర షోలతో, సీరియల్స్ తో బిజీగా మారిపోయింది. తాజాగా ఓ ఆమె గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. అందులో జీవితంలో ఎదురైన కష్టాలు మాత్రం ఆ నవ్వుల వెనుక దాగి ఉన్న చేదు నిజాలను బయటపెట్టారు. ఆ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి బాధలు, కుటుంబ పరిస్థితులు, తన తండ్రి తీరు గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
సౌమ్య చెప్పిన ప్రకారం.. ఆమె చిన్నతనం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో గడిచింది. తండ్రి చేసిన అప్పుల కారణంగా కుటుంబం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని తెలిపింది. అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి గొడవలు చేయడం, అసభ్యకరంగా మాట్లాడటం రోజువారీ పరిస్థితిగా మారిందని ఆమె గుర్తుచేసుకుంది. 'మా నాన్న ఉన్నా లేనట్టే... బాధ్యతలు అన్నీ అమ్మపైనే పడ్డాయి. డబ్బులు కోసం మమ్మల్నీ ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు.' అంటూ ఎమోషనల్ అయింది.

ఒక దశలో పరిస్థితులు అంతగా దిగజారిపోయి, తన తల్లి పిల్లలను తీసుకుని రాత్రికి రాత్రే ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చిందట. చేతిలో కేవలం రూ.100 మాత్రమే ఉండగా, తిరుపతి బస్టాండ్‌లో రాత్రంతా గడిపిన రోజులు కూడా ఉన్నాయని ఆమె తెలిపింది. ఉదయం ఆలయంలో ఇచ్చే అన్నం కోసం ఎదురు చూసిన రోజులు తన జీవితంలో మరచిపోలేనివని చెప్పింది. అంతేకాకుండా, బంధువులు ఇంటికి వస్తే వారికి టీ లేదా భోజనం పెట్టలేమని భయపడేవారమనీ, పక్కింటివారు కూడా తలుపులు మూసుకునే పరిస్థితి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
కేవలం ఆర్థిక కష్టాలే కాదు, వ్యక్తిగతంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని సౌమ్య వెల్లడించింది. కాలేజీ రోజుల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ ఓ లాయర్ వద్ద పనిచేసినప్పుడు ఆయన మిస్‌బిహేవ్ చేసిన సంఘటనను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. "నా పరిస్థితి తెలిసి దాన్ని దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశాడు" అంటూ ఆమె చెప్పిన మాటలు పరిస్థితి తీవ్రతను చూపిస్తున్నాయి. ఆ అనుభవం తర్వాత తన వ్యక్తిగత కష్టాలను ఇతరులతో పంచుకోవడం ఎంత ప్రమాదకరమో అర్థమైందని ఆమె చెప్పింది.
కన్నడలో న్యూస్ రీడర్‌గా తన కెరీర్ ప్రారంభించిన సౌమ్య, ఆ తర్వాత సీరియల్స్, షోలు చేస్తూ బిజీ అయ్యింది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఈ స్థాయికి రావడానికి ఆమె పడిన కష్టం అసాధారణమని చెప్పాలి. ఒకసారి స్టార్ హీరో ఇంటర్వ్యూకి వెళ్తుండగా ప్రమాదం జరిగినా, గాయాలతోనే షూట్‌కి వెళ్లి పని పూర్తి చేసిన సంఘటనను కూడా ఆమె వెల్లడించింది. "నొప్పి కంటే డబ్బులు మిస్ అవుతాయనే భయం ఎక్కువగా ఉండేది" అని చెప్పింది.
అంతేకాదు, ఆమె వ్యక్తిగత జీవితంలో మరో పెద్ద విషాదం కూడా ఎదురైంది. తన తల్లి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ, చివరికి తనను గుర్తుపట్టలేని స్థితికి చేరుకుందని చెప్పిన సౌమ్య, ఆ సమయంలో తాను కూతురిగా కాకుండా తల్లిగా మారి చూసుకున్నానని భావోద్వేగానికి లోనైంది. తల్లిని కోల్పోయిన బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉందని చెప్పింది. ఇప్పుడైతే సౌమ్య తన జీవితం సాదాసీదాగా సాగిస్తున్నట్లు తెలిపింది. పెద్దగా ఖర్చులు లేకుండా సాధారణ మధ్యతరగతి జీవితం గడుపుతున్నానని, ఇంకా సొంత ఇల్లు కూడా లేదని ఆమె చెప్పడం గమనార్హం. సెలబ్రిటీగా ఉన్నప్పటికీ ఆటోలోనే ప్రయాణించడం తనకు సహజమని చెప్పింది. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications