చేతిలో 10 రూపాయలు లేవు... కష్టపడినదంతా అప్పులకే... యాంకర్ స్రవంతి ఎమోషనల్
తెలుగు యాంకరింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని దూసుకెళ్తున్నారు స్రవంతి చొక్కారపు. అందంతో పాటు చలాకీతనంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ ముద్దగుమ్మ. స్టార్ యాంకర్లు సుమ కనకాల, అనసూయ, శ్రీముఖి, మంజూష వంటి వారికి గట్టి పోటీ ఇస్తున్నారు స్రవంతి. ఏ ఈవెంట్‌కి వెళ్లినా పద్ధతిగా చీరకట్టులో కనిపించడంతో పాటు హద్దులు దాటకుండా మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకుంది.
ఓ చిన్న యూట్యూబ్‌లో ఛానెల్‌లో కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు ఆ తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్‌ల పుష్ప సినిమా సమయంలో చేసిన ఇంటర్వ్యూతో రాత్రికి రాత్రి పాపులర్ అయిపోయారు. అంతకుముందు బిగ్‌బాస్‌లోనూ అవకాశం సాధించి ప్రజలకు మరింత చేరువ అయ్యారు స్రవంతి చొక్కారపు. ఈ దెబ్బతో సినిమాల ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రైవేట్ కార్యక్రమాలు, పెళ్లిళ్లు, సంగీత్‌లు వంటి వాటికి హోస్ట్‌గా బిజీ అయ్యారు స్రవంతి చొక్కారపు. ప్రస్తుతం ఏ సినిమా ఈవెంట్ జరిగినా ఈ ముద్దుగుమ్మ ఉండాల్సిందే. అంతలా తన ముద్ర వేసుకున్నారు. ఇటీవల కొన్ని సినిమాల్లో నటిగానూ అవకాశం దక్కించుకుని కొత్త ప్రయాణం మొదలుపెట్టారు స్రవంతి. అయితే ఇదంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు. దీని కోసం ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు? ఎన్నో అవమానాలు పడ్డారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి స్రవంతి చొక్కారపు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

సినిమాల్లో కనిపించాలన్న ఉద్దేశంతోనే హైదరాబాద్‌కు వచ్చా. ఓ టీవీలో యాంకర్లు, నటీనటులు కావలెను అని ఓ యాడ్ రావడంతో ఇంట్లో విషయం చెప్పా. మా నాన్న ముందు వద్దు అన్నా.. తర్వాత మా అమ్మ ఒప్పించింది. మా నాన్న హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో 2009లో దించేసి వెళ్లారు. అక్కడ హాస్టల్‌లో ఉంటూ పార్ట్ టైం జాబులు చేస్తూ డ్యాన్స్ నేర్చుకున్నా.. అక్కడ చిన్న చిన్న నటీనటులు వచ్చి మమ్మల్ని షూటింగ్స్‌కి తీసుకెళ్లేవారు. మా రూమ్ మెట్‌కి హీరో రాజశేఖర్ బంధువు.. ఓ రోజున ఆయన లంచ్‌కి రమ్మని పిలవడంతో మహంకాళి సెట్స్‌కి వెళ్లాం. అయితే ఆ సినిమాలో చేయాల్సిన ఓ అమ్మాయి హ్యాండ్ ఇవ్వడంతో ఓ సీన్ కోసం నన్ను అడిగారు. అందులో జర్నలిస్ట్ రోల్.. అలా 12 రోజుల పాటు ఆ సినిమాలో నటించా.. రోజుకు 3 వేల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు. దాంతో అక్కడి నుంచి సినిమాలపై ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పుట్టింది. స్క్రీన్‌లో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఆ థ్రిల్ వేరేనని స్రవంతి చెప్పారు.
హైదరాబాద్‌లో ఉన్నప్పుడే మా ఆయనతో పరిచయం కావడం, పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. మా రూమ్‌మెట్ బాయ్‌ఫ్రెండ్‌కి మా ఆయన ఫ్రెండ్ కావడంతో ఆమె కోసం వచ్చినప్పుడు నాతో పరిచయం ఏర్పడింది. ఆశ్చర్యకరంగా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేదు.. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి, పిల్లలతో రెండేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా. మా ఆయన బిజినెస్‌లో నష్టం రావడం, ఆర్ధిక సమస్యల కారణంగా నేను కూడా జాబ్ చేయాలని జ్యువెలరీ స్టోర్‌లో ఆయనే ఉద్యోగం చూశారు. అయితే అన్ని గంటలు నిలబడలేకపోవడంతో ఉద్యోగం మానేశాను. దాంతో మా ఆయన ఫ్రెండ్ మా టీవీలో వర్క్ చేస్తుండటంతో అక్కడ యాంకర్‌గా ఖాళీ ఉందని తెలిసి ఆడిషన్స్‌కి వెళ్లి సెలెక్ట్ అయ్యానని స్రవంతి తెలిపారు.
ఆ తర్వాత పీఆర్‌వో ఏలూరి శ్రీను మాకు దగ్గరిలోనే ఉండేవారు.. ఆయన సలహాతో ఫ్రీలాన్స్ యాంకర్‌గా స్టార్ట్ చేశా. అప్పటి నుంచి హీరోలను ఇంటర్వ్యూలు చేస్తూ వచ్చాను. అఖిల్ గారి సినిమా ఈవెంట్ వైజాగ్‌లో జరిగితే దానికి హోస్ట్‌గా చేశా. ఆ సమయంలో అల్లు అరవింద్ గారు చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1000కి పైగా ఈవెంట్స్ చేశాను. పుష్ప 1 రిలీజ్ సమయంలో రాయలసీమ స్లాంగ్‌తో ఇంటర్వ్యూ చేయిస్తే బాగుంటుందని వెతికితే నేనున్నాని తెలిసి చేయించారు. పుష్ప 1 ఇంటర్వ్యూతో ఫేమ్ వచ్చి బిగ్‌బాస్‌లోనూ ఛాన్స్ దొరికింది. ఆ ఇంటర్వ్యూ అయిపోయా, బిగ్‌బాస్ అయిపోయాక సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ గారిని కలిశా. మనకి మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది తెలిసుండాలి. కళ్ల నిండా నీళ్లతో ఆయన చేయి పట్టుకుని చూస్తూ ఉండిపోయా. అప్పుడున్న స్టేజ్‌కి నాకు ఆ డబ్బులు చాలా అవసరమని స్రవంతి చొక్కారపు కన్నీటి పర్యంతమయ్యారు.
డబ్బులు ఎక్కువగా దాచుకోలేను.. నా చుట్టూ ఉన్నవాళ్లు అవసరంలో ఉన్నాను అంటే ఇచ్చేస్తాను. ఇప్పటి వరకు కుటుంబం కోసం కష్టపడ్డా... 10 రూపాయలు చేతిలో లేనప్పుడు ఎంతో ఇబ్బందిపడ్డాను. ఆ డబ్బులుంటే బాబుకి బిస్కెట్ ప్యాకెట్ అయినా వస్తుందని ఆలోచించిన రోజులున్నాయి. ఇంత సంపాదించినా హైదరాబాద్‌లో కనీసం ఇల్లు కూడా కొనలేదు. కష్టపడి 10 ఏళ్లపాటు అప్పులు కట్టా. మా ఆయనకి అనుకోకుండా బిజినెస్‌లో నష్టం వచ్చింది. జీరో నుంచి స్టార్ట్ చేశాం.. ఇద్దరం కలిసి అన్ని తీర్చేశాం. నాకు అసలు పనిచేయడం అస్సలు ఇష్టం లేదు. ఇప్పటి వరకు నేను చేయగలిగినదంతా చేశా. అయితే ఇన్నాళ్లూ కష్టపడి పనిచేశాం.. సరిగ్గా దాని ప్రతిఫలం వస్తున్న సమయంలో వదిలేయడం ఎందుకు అని సినిమాలు ఒప్పుకుంటున్నానని స్రవంతి చొక్కారపు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











