శ్రీముఖి గ్యాంగ్ లీడర్.. ఆర్జే చైతు, యాంకర్ విష్ణుప్రియలతో కలిసి రెచ్చిపోయిన రాములమ్మ
బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాపులర్ అయిన కంటెస్టెంట్లు తక్కువే. అయితే విపరీతమైన పాపులార్టీ ఉండి.. బిగ్‌బాస్‌లో వచ్చిన కంటెస్టెంట్ మాత్రం శ్రీముఖే. బుల్లితెరపై రాములమ్మగా ఓ ఊపు ఊపుతుండగా.. సడెన్‌గా మాయమైపోయింది. బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో దానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమైంది. అయితే బుల్లితెరపై శ్రీముఖి సందడి తగ్గిపోయిందని ఆమె అభిమానులు నిరాశ చెందినా.. బిగ్‌బాస్ రూపంలో మళ్లీ ఫ్యాన్స్ ముందుకు వచ్చింది.

బిగ్‌బాస్‌లో శ్రీముఖి అల్లరి..
బిగ్‌బాస్ హౌస్‌లో బాబా భాస్కర్‌తో కలిసి శ్రీముఖి చేసిన అల్లరి బాగానే వర్కౌట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే ముచ్చట్లు, తగాదాలు, సరదాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఉదయాన్నే బిగ్‌బాస్ వేసే పాటలకు వీరిద్దరు కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసేవారు. ఈ సీజన్ మొత్తానికి ఎంటర్టైన్మెంట్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్ మార్కులు కొట్టేశారు. వీరిద్దరి కాంబినేషన్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందనడంలో సందేహం లేదు.

రాహుల్‌ను టార్గెట్ చేయడంతో..
బయట స్నేహితులమని చెప్పుకున్న రాహుల్, శ్రీముఖిలు లోపల మాత్రం శత్రువులుగా మారారు. రాహుల్‌ను పదే పదే టార్గెట్ చేయడంతో శ్రీముఖి వ్యూహం దెబ్బతింది. రాహుల్‌ను అకారణంగా పాయింట్ అవుట్ చేస్తూ రావడంతో శ్రీముఖిపై నెగెటివిటీ పెరుగుతూ.. రాహుల్‌కు సింపతీ పెరిగింది. చివరకు తన ఆశలకే గండి పడ్డట్లు అయింది. ఈ కారణమే శ్రీముఖిని విన్నర్ కానీయకుండా రన్నరప్‌గానే మిగిల్చింది.

శ్రీముఖిపై పెరిగిన నెగెటివిటీ..
బిగ్‌బాస్ షో అందరికీ ఒకే రకమైన పాపులార్టీని ఇవ్వదు. అంతకుముందున్న క్రేజ్‌ను అమాంతం రెట్టింపు చేయగలదు లేదా.. ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా చేయగలదు. అందుకే బిగ్‌బాస్ షోలో పాల్గొనాలంటే సెలెబ్రిటీలు అంత మక్కువ చూపరు. శ్రీముఖికి బిగ్‌బాస్ షోలో రాకముందున్న క్రేజ్ పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు బుల్లితెరపై అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్న ప్రేక్షకులకు ఆమె నిజస్వరూపం తెలిసిపోయింది. శ్రీముఖి కన్నింగ్ అంటూ చాలా మంది ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఆమె చూపే ప్రేమంతా నటనే అంటూ కామెంట్లు చేశారు.
ఫ్రస్ట్రేషన్ తీర్చుకునేందుకు మాల్దీవులు..
బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లాక మాల్దీవులకు వెళ్తానని శ్రీముఖి చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అందుకే హౌస్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే అక్కడికి ఎగిరిపోయింది. ఇంటర్వ్యూలు అంటూ ఇక్కడ తిరగకుండా.. మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తోంది. హౌస్‌లోని ఫ్రస్ట్రేషన్ అంతా అక్కడ తీర్చేసుకుంటోంది.

గ్యాంగ్ లీడర్ స్టెప్పులు
ఇటీవలె నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రంలోని టైటిల్ సాంగ్‌కు శ్రీముఖి అదిరిపోయే స్టెప్పులు వేసింది. తన గ్యాంగ్ ఆర్జే చైతు, విష్ణు ప్రియ ఇంకోఇద్దరితో కలిసి స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాసాగింది. నేటి సాయంత్రం శ్రీముఖి లైవ్‌లోకి వచ్చి ఫ్యాన్స్‌తో ముచ్చటించనుంది.


Click it and Unblock the Notifications











