నోటీసు వచ్చినప్పుడు స్పందిస్తా
బెంగళూరు :బుల్లితెరపై నటులు వేర్వేరు కార్యక్రమాలను నిర్వహించటంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారని చలన చిత్ర వాణిజ్య మండలికి కొందరు నిర్మాతలు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈగ ఫేం నటుడు కన్నడ హీరో సుదీప్ వద్ద ప్రస్తావించగా, 'దానికి సంబంధించి నాకు ఇంత వరకు ఎటువంటి నోటీసు అందలేదు, వారు వివరణ అడిగితే అప్పుడే స్పందిస్తానని' ఆయన పేర్కొన్నారు.
ప్యారగాన్ చెప్పుల సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ఆయన ముందుకు వచ్చారు. సంస్థ రూపొందించిన టీవీ ప్రోమోలు, పోస్టర్ ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.చాలా రోజుల తరువాత ఒక సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించటం తనకు కొత్తగా ఉందని సుదీప్ పేర్కొన్నారు. చలన చిత్రాల్లో నటనకు, టీవీ ప్రకటనల్లో నటనకు చాలా తేడా ఉంటుందని చెప్పారు. సమయాభావం కారణంగానే తానే ప్రచార చిత్రాలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను నటిస్తున్న తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల గురించి తెలిపేందుకు ఆయన నిరాకరించారు. తనను ప్రేక్షకులు ఆదరించినంత కాలం తాను నటిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ప్యారగాన్ సంస్థ తరపున ఆయన ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ప్రచారాన్ని ప్రారంభించారు.

బుల్లితెరపై హీరోల రియాలిటీ ప్రదర్శనలకు కళ్లెం వేయాలంటూ నిర్మాతలు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి ఫిర్యాదు చేశారు. సుదీప్, రమేష్ అరవింద్, గోల్డెన్‌స్టార్ గణేష్‌లు వివిధ ఛానళ్లలో వారాంతాల్లో రియాలిటీ ప్రదర్శనల్లో పాల్గొనడం వల్ల కన్నడ సినిమాల్ని వీక్షించే ప్రేక్షకులే కరువయ్యారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయమై మంగళవారం వాణిజ్య మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసింది. అయితే వాణిజ్య మండలి అధ్యక్షుడు హెచ్.డి.గంగరాజు చెన్నై వెళ్లడంతో దీన్ని రద్దు చేశారు. నిర్మాతల ఫిర్యాదుపై స్పందించేందుకు నటులు నిరాకరించారు. మండలి నుంచి నోటీసు వస్తే అప్పుడు చూస్తామని సమాధానమిచ్చారు.
నిర్మాతల ఫిర్యాదుపై చర్చించేందుకు మంత్రి, నటుడు అంబరీష్‌తో సమావేశం కావాలని నటీనటులు తీర్మానించారు. తెలుగులోనూ ఇలాంటి ప్రతిపాదన ఒకటి ఉందని ఇక్కడ ఫిల్మ్ సర్కిల్స్ లోనూ చెప్పుకుంటున్నారు. మన హీరోలు వీకెండ్ లలో టీవీ షోలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











