‘ 18 ఏళ్లకే ఇల్లు వదిలేశా .. అతను జీవితాంతం నన్ను పోషిస్తానని’
ఇప్పుడు బుల్లితెర, వెండితెరపై స్టార్స్‌గా వెలుగొందున్న ఎంతో మంది ఊరకే స్టార్స్ అయిపోలేదు. దీని వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు , అవమానాలు ఉన్నాయి. అన్నింటికి అధిగమించి వారు తమ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. అప్పుడప్పుడు తమ జీవితాలు, ఉన్నతంగా ఎదిగేందుకు తాము చేసిన త్యాగం, కృషి, పట్టుదల గురించి చెబుతుంటారు. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ, సినీ నటి తేజస్వి మదివాడ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌తో వెండితెరపైకి
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తేజస్వి మదివాడ .. 2012లో శేఖర్ కమ్ముల అంతా కొత్తవారితో తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో అవకాశం దక్కించుకుని చిన్న పాత్రలో కనిపించారు. ఆ వెంటనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్ బాబు - వెంకటేష్‌ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సమంతకు కజిన్‌గా గోదావరి యాసలో మాట్లాడుతూ అలరించారు. తర్వాత మనం, హార్ట్ అటాక్ వంటి సినిమాల్లో నటించింది. ఈ దశలో క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కళ్లలో పడిన ఆమె.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీమ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకున్నారు. అందులో హాట్ హాట్ అందాలను ఆరబోసినా పెద్దగా జనం ఆదరించలేదు.
కలిసిరాని బిగ్‌బాస్
తర్వాత లవర్స్, అనుక్షణం, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, కేరింత, సుబ్రమణ్యం ఫర్ సేల్, శ్రీమంతుడు, జత కలిసే, కృష్ణాష్టమి, మిస్టర్, బాబు బాగా బిజీ, బాలకృష్ణుడు, జాంబీ రెడ్డి, కమిట్‌మెంట్ వంటి సినిమాల్లో నటించింది. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 2లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఆరు వారాల పాటు హౌస్‌లో ఉంది. ఈ మెగా రియాలిటీ షో కూడా తేజస్వికి బ్రేక్ ఇవ్వలేకపోయింది. సినిమాలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలో పరిణామాలు, క్యాస్టింగ్ కౌచ్ వంటి అంశాలపై అప్పట్లో తేజస్వి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
బుల్లితెరపై రీ ఎంట్రీ
లాంగ్ గ్యాప్ తర్వాత అర్ధమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. మరో బ్రేక్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తునప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. దీంతో మరోసారి బుల్లితెరనే నమ్ముకుంది. దీనిలో భాగంగా స్టార్ మాలో ప్రసారం కానున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే టీవీ షోలో తేజస్వి కంటెస్టెంట్‌గా కనిపించనుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలవ్వగా రోహిత్ భరద్వాజ్ అనే వ్యక్తితో కలిసి ఎంట్రీ ఇచ్చిన తేజస్వీ తన జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
నా జీవితం రోహిత్‌తోనే
నాకు పదేళ్లు ఉన్నప్పుడే అమ్మ చనిపోయిందని తర్వాత నాన్న తమను పట్టించుకోలేదని తేజస్వీ ఆవేదన వ్యక్తం చేశారు. నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడే ఇంట్లో నుంచి బయటికి వచ్చేశానని, తనను అప్పటి నుంచి రోహిత్ కుటుంబమే చూసుకుంటుందని, జీవితాంతం నా బాగోగులు చూసుకుంటానని చెప్పారని తేజస్వీ వెల్లడించారు. నాకంటూ ఉన్నది రోహిత్ ఫ్యామిలీయేనని, ఒంటరితనం వల్ల షూటింగ్ సెట్‌కి వచ్చినప్పుడు పండగలా అనిపిస్తుందని అందుకే జనంలో గడపటానికి ఎక్కువ ఇష్టపడతానని ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం తేజస్వీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. శ్రీముఖి హోస్ట్‌గా అనసూయ భరద్వాజ్, శేఖర్ మాస్టర్‌లు జడ్జిలుగా వ్యవహరిస్తున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











