నా ఫ్యామిలీని చేతబడి చేసి చంపారు.. నన్ను లైంగికంగా వేధించారు..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కీర్తి భట్ (Keerthi Bhat)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu Season 6) ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈ సీరియల్ నటి, తన అందం, అమాయక స్వభావం, నిజాయితీ మాటలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే తెరపై నవ్వుతూ కనిపించే కీర్తి భట్ జీవితంలో ఎన్నో కన్నీటి కథలు దాగి ఉన్నాయని గతంలోనే పలుమార్లు చెప్పారు. తాజాగా ఆమె పాత ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కీర్తి భట్ కన్నడ కుటుంబానికి చెందిన అమ్మాయి. మంచి కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నప్పటి నుంచి ఎలాంటి కష్టాలు తెలియకుండా పెరిగిందని చెబుతుంటారు. తండ్రి మంచి వ్యాపారవేత్తగా, కుటుంబానికి ఆర్థికంగా బలమైన స్థితి ఉండేదని చెప్పారు. కానీ ఒక్క ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపారు. 2017లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కీర్తి తన తల్లిదండ్రులు, అన్న, వదినలను కోల్పోయారు. ఒకే కుటుంబం నుంచి దాదాపు అందరూ మరణించగా, కీర్తి మాత్రం తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ప్రమాదం తర్వాత కొంతకాలం కోమాలో ఉండాల్సి వచ్చిందని, కోలుకునే వరకు జీవితం చీకటిగా మారిపోయిందని తెలిపారు.

అయితే ఆ ప్రమాదం వెనుక సహజ కారణాలు మాత్రమే లేవని, తన బంధువుల కుట్ర కూడా ఉందని కీర్తి సంచలన ఆరోపణలు చేశారు. "మీరు నమ్ముతారో లేదో.. మా అమ్మానాన్నపై బ్లాక్ మ్యాజిక్, చేతబడి చేయించారు. మా నాన్న ఎదుగుదలను ఓర్వలేక కొందరు బంధువులు ఇలా చేశారు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. యాంకర్ ఈ విషయంపై ప్రశ్నించగా, ప్రమాదం జరిగిన తర్వాత జరిగిన పరిణామాలే తన అనుమానాలకు కారణమని కీర్తి వివరించారు. "ఒకే కారులో నేను, మా అమ్మ, మా నాన్న ఉన్నాం. వాళ్లు చనిపోయారు.. నేను మాత్రం ప్రాణాలతో బయటపడ్డాను. నా కాలికి ఫ్రాక్చర్ అయింది. చాలా చోట్ల గాయాలయ్యాయి. కోమాలో ఉండాల్సి వచ్చింది. నడవలేని పరిస్థితి వచ్చింది" అని గుర్తు చేసుకున్నారు.
అంతేకాదు, తాను కోమాలో ఉన్న సమయంలో కుటుంబ ఆస్తులన్నీ తమ పేర్లకు మార్చుకునేందుకు బంధువులు ప్రయత్నించారని చెప్పారు. "నేను బతికి బయటపడతానని వాళ్లు ఊహించలేదు. నేను కోమా నుంచి బయటకొచ్చి మాట్లాడటం, నడవటం మొదలుపెట్టిన తర్వాత వాళ్లకు షాక్ అయింది. అప్పటి నుంచి నన్ను వేధించడం మొదలుపెట్టారు" అని తెలిపారు. ఆ సమయంలో తిండి కూడా సరిగా పెట్టేవారు కాదని, మానసికంగా తీవ్రంగా హింసించారని చెప్పారు. ఇంకా షాకింగ్‌గా "మా మామ కొడుకు నన్ను లైంగికంగా వేధించాడు" అంటూ కీర్తి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని వెల్లడించారు.
ఇలా జీవించడం కష్టమై ఒక రోజు ఎవరికి చెప్పకుండా ఆ ఇంటి నుంచి పారిపోయి బెంగుళూర్ చేరుకున్నానని చెప్పారు. "అక్కడికి వెళ్లాక నా మీద మిస్సింగ్ కేసు పెట్టారు. దాదాపు నెల రోజుల తర్వాత నన్ను కనుగొని బలవంతంగా తిరిగి తీసుకెళ్లారు" అని వివరించారు. ఇక పోలీస్ స్టేషన్‌లో ఎదుర్కొన్న అనుభవం తన జీవితంలో అత్యంత దారుణమని కీర్తి అన్నారు. "వాళ్లు నన్ను అడిగిన మొదటి ప్రశ్న.. ఎవడితో లేచిపోయావు? అన్నీ అయిపోయాయా? ఎవరు వాడు? అంటూ అసహ్యంగా మాట్లాడారు. నేను ఎందుకు వెళ్లాను? ఏం జరిగింది? అనే విషయం ఎవరూ అడగలేదు" అని తెలిపారు.
తాను బెంగళూరులో ఒంటరిగా ఎలా బతికానో, ఎంత కష్టపడ్డానో ఎవరికీ పట్టలేదని చెప్పారు. "నా బంధువులు డబ్బులు ఇచ్చి పోలీసులను మేనేజ్ చేశారు" అంటూ మరో సంచలన ఆరోపణ చేశారు. ఆ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్న తాను బయటపడటానికే ఏమైనా చేయడానికి సిద్ధపడ్డానని తెలిపారు. "వాళ్లు నా దగ్గర చాలా డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకున్నారు. నేను బయటపడాలనే ఆలోచనతో ప్రశ్నించలేదు. కానీ సంతకాలు తీసుకున్న తర్వాత మళ్లీ బలవంతంగా ఆ ఇంటికి తీసుకెళ్లారు" అని చెప్పారు.
అంతటితో ఆగకుండా మరోసారి పోలీసుల జోక్యంతో తనను ఏడు రోజులపాటు రిమాండ్ జైలుకు పంపించారని వెల్లడించారు. "జైలులో పరిస్థితి ఇంకా దారుణం. ఐదు రోజుల పాటు అన్నం కూడా తినలేదు. అక్కడి వార్డెన్ ప్రవర్తన చాలా కఠినంగా ఉండేది" అని కీర్తి తెలిపారు. చివరికి తనకు కేవలం రూ.300 ఇచ్చి బెంగళూరుకు పంపించారని చెప్పారు. "రాత్రి సమయానికి అక్కడికి చేరుకున్నాను. వెళ్లాల్సిన చోటుకు క్యాబ్ వాళ్లు రూ.300 అడిగారు. డబ్బుల్లేక బస్టాండ్‌లోనే ఉండిపోయాను. కొందరు ఆకతాయిలు 200 ఇస్తే వస్తావా? 300 ఇస్తే వస్తావా? అంటూ అసహ్యంగా మాట్లాడారు" అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
"ఆరోజే నాకు జీవితం అంటే ఏమిటో అర్థమైంది. ఒంటరి మహిళగా సమాజంలో బతకడం ఎంత కష్టమో తెలుసుకున్నాను" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. కీర్తి భట్ చెప్పిన ఈ కథనం విన్నవారిని కలచివేస్తోంది. తెరపై చిరునవ్వుతో కనిపించే కళాకారుల జీవితాల్లో ఎంతటి బాధలు దాగి ఉంటాయో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.


Click it and Unblock the Notifications