నన్ను ఇలా చేసినవాడి నాశనం చూశాకే చస్తా.. జబర్థస్త్ నటుడి ఆవేదన!
బుల్లితెరపై నవ్వులు పంచి కోట్లాది మంది ప్రేక్షకులకు దగ్గరైన ఓ జబర్దస్త్ కమెడియన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. "నన్ను, నా కెరీర్ ను ఇలా చేసిన వాళ్ల నాశనం చూశాకే చస్తా" అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఒకప్పుడు టీవీ షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు అవకాశాలు తగ్గిపోవడానికి కొందరి కుట్రలే కారణమని ఆరోపించారు. ఇంతకీ అంతగా బాధతో ఇలా మాట్లాడిన ఆ జబర్దస్త్ కమెడియన్ ఎవరు? ఆయన జీవితంలో అసలు ఏమైంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ఆ జబర్దస్త్ కమెడియన్ ఎవరో కాదు.. చలాకీ చంటి (Chalaki Chanti). ఈ పేరు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన చలాకీతనం, కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన చంటి.. ఒకప్పుడు టెలివిజన్, సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగారు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఆయనకు భారీ గుర్తింపు వచ్చింది. అయితే కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోవడం, ఆరోగ్య సమస్యలు రావడం, ఆ తర్వాత తెరపై కనిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఆయన గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

చలాకీ చంటి తన ప్రత్యేక శైలి కామెడీతో జబర్దస్త్‌లో మంచి పేరు సంపాదించారు. స్కిట్స్‌లో ఆయన చెప్పే డైలాగులు, టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకునేవి. ఆ ఫేమ్‌తో సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. టీవీ షోలు, స్టేజ్ ఈవెంట్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇలా బిజీ షెడ్యూల్‌తో చంటి ఒక దశలో టాప్ కమెడియన్‌గా కొనసాగారు. అంతేకాదు, పలు ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో యాంకర్‌గా కూడా కనిపించారు. ఒకప్పుడు ఈటీవీలో వచ్చే దాదాపు ప్రతి వినోదాత్మక కార్యక్రమంలో చంటి కనిపించేవారని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.
అయితే కెరీర్ బాగా సాగుతున్న సమయంలో చంటి గుండెకు సంబంధించిన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆ ఘటన ఆయన జీవితాన్నే మార్చేసిందని అంటున్నారు అభిమానులు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చినా, గతంలా అవకాశాలు మాత్రం రాలేదని తెలుస్తోంది. దీంతో సినిమాలకు, బుల్లితెరకు కొంతకాలం దూరమయ్యారు. తాజాగా వైరల్ అవుతున్న ఇంటర్వ్యూలో చంటి చేసిన వ్యాఖ్యలు హార్ట్ టచ్చింగ్ గా ఉన్నాయి. సినీ రంగంలో తనకు ఎంతోమంది పరిచయాలు ఉన్నాయని, కానీ తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కరూ పలకరించలేదని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. "డబ్బు ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతారు. మనం బాగా సంపాదిస్తున్నప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడుతారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు కనీసం ఫోన్ కూడా చేయరు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా "ఈ కాలంలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ. లేకపోతే ఎవరూ పట్టించుకోరు" అని సమాజంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కెరీర్ పడిపోవడానికి కొందరి దుష్ప్రచారమే కారణమని చంటి సంచలన ఆరోపణలు చేశారు. "నాకు ఈగో ఎక్కువ అని, షూటింగ్‌కి వెళ్తే చాలా డబ్బు అడుగుతానని కొందరు ప్రచారం చేశారు. నాకు సంబంధం లేని గొడవల్లో నా పేరు ఇరికించారు. అలా చేసి నాకు రావాల్సిన అవకాశాలు పోగొట్టారు" అని అన్నారు.
సినిమాల్లో తనకు రావాల్సిన పాత్రలు కూడా చివరి నిమిషంలో ఆగిపోయాయని, కొందరు కావాలనే తన ఇమేజ్ దెబ్బతీశారని చెప్పారు. ఈ సందర్భంగా చంటి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "నాపై అబద్ధాలు చెప్పి, నా జీవితాన్ని ఇలా చేసిన వాళ్లు సర్వనాశనం అవ్వాలి. వాళ్ల నాశనం నేను బతికుండగానే చూడాలి. అది చూసాకే నేను చస్తాను" అంటూ ఆవేశంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు చంటి బాధను అర్థం చేసుకుంటూ సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు ఇంత కోపంతో మాట్లాడకూడదని సూచిస్తున్నారు. ఏదేమైనా, ఒక కమెడియన్ నవ్వుల వెనుక ఎంత బాధ దాగి ఉంటుందో చంటి మాటలు మరోసారి గుర్తు చేశాయి.


Click it and Unblock the Notifications