చెల్లికి సెట్ చేద్దాం అనుకుని నేనే పెళ్లి చేసుకున్నా.. సీరియల్ నటి లవ్ స్టోరీలో సినిమాకి మించిన ట్విస్ట్!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సమీరా షరీఫ్ (Sameera Sherief) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా, యాంకర్‌గా, తన అందం, అభినయం, సరదా స్వభావంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీరా, ఎన్నో హిట్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆడపిల్ల, జీవితం, భార్యామణి, ముద్దుబిడ్డ, డాక్టర్ చక్రవర్తి, మనసు మమత, ప్రతిబింబం, మంగమ్మగారి మనవరాళ్లు, తోడికోడళ్లు, అరవింద సమేత వంటి సీరియల్స్‌లో నటించి బుల్లితెరపై తన ముద్ర వేశారు. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు ధారావాహికల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే సమీరా ప్రొఫెషనల్ జీవితమే కాదు, ఆమె వ్యక్తిగత జీవితం కూడా చాలామందికి ఆసక్తికరమే. ముఖ్యంగా ఆమె ప్రేమకథలో ఉన్న ట్విస్టులు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
సమీరా.. సయేద్ అన్వర్ ఆహ్మద్(Syed Anwar Ahmed)ను ప్రేమించి 2019లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బయటకు చూస్తే ఇది సాధారణ ప్రేమకథలా కనిపించినా, లోపల మాత్రం ఆసక్తికర మలుపులు దాగి ఉన్నాయి. సమీరా చెప్పిన వివరాల ప్రకారం.. మొదట అన్వర్‌ను తన కోసం కాదు.. తన చెల్లెలి కోసం చూసిందట. ఆమె అక్క నాన్ ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కుటుంబంలో కొంత ఒత్తిడి ఏర్పడిందట. దీంతో చెల్లెలి పెళ్లి బాధ్యత తనపై పడిందని సమీరా తెలిపింది. మంచి ముస్లిం కుటుంబానికి చెందిన అబ్బాయిని చూసి చెల్లెలికి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో అన్వర్ పరిచయం అయ్యాడట. మొదట అతడిని చెల్లెలికి సరిపడే వరుడిగా భావించిందట. కానీ చివరికి అదే పరిచయం ప్రేమగా మారి, తనే పెళ్లి చేసుకున్నానని సరదాగా చెప్పుకొచ్చింది.

ఈ ప్రేమకథ 2015 మార్చి 6న ప్రారంభమైందట. ఒకరోజు మాల్‌కు వెళ్లిన సమీరాను ఇద్దరు యువకులు గుర్తించి పలకరించారట. అందులో ఒకరు ఫోటో అడిగి ఆమెతో దిగారట. తరువాత వెళ్తూ తాను సీనియర్ నటి సనా (Sana) కుమారుడినని చెప్పాడట. అప్పట్లో సమీరా, సనా కలిసి ప్రతిబింబం సీరియల్‌లో నటిస్తున్నారట. అతను సనా కొడుకని తెలిసిన తర్వాత సమీరా సరిగ్గా స్పందించలేదని సారీ చెప్పిందట. ఆ తరువాత ఈ పరిచయం సోషల్ మీడియాలో కొనసాగిందట.
సమీరానే ఫేస్‌బుక్‌లో అన్వర్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగా, అతను వెంటనే అంగీకరించాడట. అక్కడి నుంచి మాటలు మొదలై, క్రమంగా ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకునే స్థాయికి చేరుకున్నారట. ఒకసారి మాట్లాడుకుంటూ రాత్రంతా గడిపి తెల్లవారుజామున 6 అయ్యే వరకు సంభాషణ కొనసాగిందని సమీరా చెప్పింది. అదే సమయంలో ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడిందట.
ఆ సమయంలోనే తాను "ఐ లైక్ యూ" చెప్పాడని పొరపాటున "లవ్ యూ" అనేశానని సమీరా నవ్వుతూ గుర్తు చేసుకుంది. అదే సమయంలో అన్వర్ తనకంటే నాలుగు నెలలు చిన్నవాడని తెలిసిందట. అయినప్పటికీ వయస్సు తేడా తమ ప్రేమకు అడ్డుకాలేదని తెలిపింది. మొదట చెల్లెలికి సెట్ చేయాలని అనుకుని మాట్లాడటం మొదలుపెట్టినా, చివరికి తానే ప్రేమలో పడిపోయానని చెప్పింది.
చివరకు ఇద్దరి కుటుంబాల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. తాను మొదట అన్వర్‌ను చెల్లెలికి సెట్ చేయాలని అనుకున్న విషయం, చెల్లెలి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాతే అతనికి చెప్పిందట. అది విన్న అన్వర్‌తో పాటు కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారని సమీరా నవ్వుతూ చెప్పింది. మొత్తానికి సమీరా-అన్వర్ ప్రేమకథలో స్నేహం, కుటుంబ బాధ్యత, భావోద్వేగం, సరదా ట్విస్ట్ ఉంది. చెల్లెలికి వరుడిగా చూసిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా చేసుకోవడం అనేది నిజంగా సినిమాల కథలను తలపించే ప్రేమకథ అని చెప్పాలి.


Click it and Unblock the Notifications




