వాళ్లకి రూ.10 లక్షలు ఫైన్ కట్టాను.. అప్పుడే వదిలారు: ముక్కు అవినాష్ ఆవేదన
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ముక్కు అవినాష్ (Mukku Avinash)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కామెడీ టైమింగ్, అమాయక హావభావాలు, ప్రత్యేక స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటారు.ప్రముఖ కామెడీ షో జబర్థస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ షోలో తనదైన కామెడీతో నవ్వులు పూయించిన అవినాష్, తర్వాత బిగ్ బాస్ తెలుగు ద్వారా మరింత పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం టెలివిజన్ షోలు, ఈవెంట్లు, యాంకరింగ్, సినిమాలతో బిజీగా మారాడు. అయితే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో అవినాష్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు. ఈ ఇంటర్య్వూలో ఆయన చేసిన కామెంట్స్ మరో సారి వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమైందంటే?
జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన అవినాష్, ఆ షోలో ఎంతోకాలం పనిచేశాడు. తన ప్రతిభతో మంచి పేరు తెచ్చుకుని, ప్రేక్షకుల్లో ప్రత్యేక అభిమానాన్ని సంపాదించాడు. అయితే ఆ సమయంలోనే బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడంతో తన జీవితంలో కొత్త మలుపు తిరిగిందని తెలిపాడు. ఓ ఇంటర్య్వూలో అవినాష్ మాట్లాడుతూ.. 'ఒకరోజు బిగ్ బాస్ వాళ్ల నుంచి కాల్ వచ్చింది. షోలో పాల్గొనమని చెప్పారు. అది నాకు పెద్ద అవకాశం అనిపించింది. వెంటనే జబర్దస్త్ టీమ్‌ను సంప్రదించి, నేను వెళ్లాలని ఉందని చెప్పాను. కానీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి బయటకు రావాలంటే రూ.10 లక్షలు ఫైన్ కట్టాలని చెప్పారు" అని వెల్లడించాడు.

అప్పటికే తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అప్పులు కూడా ఎక్కువగా ఉన్నాయని అవినాష్ తెలిపాడు. "నా పరిస్థితి బాగోలేదని చెప్పాను. కొంత తగ్గిస్తారనుకున్నాను. రెండు లక్షలు, మూడు లక్షలు అయినా అడుగుతారనుకున్నాను. కానీ పూర్తిగా రూ.10 లక్షలు కట్టాల్సిందే అన్నారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, "నేను వాళ్లను తప్పుపట్టడం లేదు. వాళ్ల రూల్స్ ప్రకారం వాళ్లు చేశారు. కానీ ఎనిమిదేళ్లు పనిచేశాను కదా.. కాస్త కనికరం చూపిస్తారనుకున్నాను. అదే కంపెనీని అప్పుగా డబ్బులు అడిగాను. ఇస్తారని అనుకున్నాను. కానీ ఇవ్వలేమన్నారు" అని చెప్పాడు.
అవసరమైన రూ.10 లక్షల కోసం చాలా చోట్ల అప్పులు చేయాల్సి వచ్చిందని కూడా వెల్లడించాడు. "ఆ డబ్బు కోసం చాలా మంది దగ్గర తిరిగాను. చివరకు చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, శ్రీముఖి తనకు సహాయం చేశారట. కొంత డబ్బు వాళ్ల దగ్గర నుంచి వచ్చింది. ఇంకొంత స్టార్ మా నుంచి అడ్వాన్స్ తీసుకున్నాను. అలా మొత్తం రూ.10 లక్షలు కట్టి బయటకు వచ్చాను" అని చెప్పాడు. అప్పుడే మల్లెమాల నన్ను వదిలిపెట్టింది" అని అవినాష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సమయంలో తనకు ఎంత ఒత్తిడి వచ్చిందో గుర్తు చేసుకున్నాడు. అయినప్పటికీ ఆ నిర్ణయం తన జీవితాన్ని మార్చేసిందని అన్నాడు.
బిగ్ బాస్ షో తన జీవితానికి టర్నింగ్ పాయింట్ అయిందని అవినాష్ తెలిపాడు. "పది లక్షలు కట్టినా, బిగ్ బాస్ ద్వారా దానికంటే ఎక్కువే వచ్చింది. మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు. నా అప్పులు అన్నీ క్లియర్ అయ్యాయి. ఆ షో వల్ల నాకు కొత్త జీవితం వచ్చింది" అని చెప్పాడు. ఇంకా తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. 'కరోనా సమయంలో హోమ్ లోన్ తీసుకుని కొన్న ఇంటికి ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో ఆ ఇంటి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. అంతలోనే బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. అది నాకు పునర్జన్మ లాంటిది" అంటూ భావోద్వేగంగా చెప్పాడు.
ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ మరో చేదు అనుభవం కూడా పంచుకున్నాడు. "ఒకసారి ఓ స్టూడియోకి వెళ్లి ఫొటో ఇచ్చాను. సరే చూద్దాం అన్నారు. నేను వెనక్కి తిరిగిన వెంటనే నా ఫొటో చించి డస్ట్‌బిన్‌లో పడేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఆఫీస్ నుంచి నా డేట్స్ కోసం కాల్ వచ్చింది" అని చెప్పాడు. ముక్కు అవినాష్ చేసిన ఈ కామెంట్స్ వైరలవుతున్నాయి. నవ్వులు పంచే కామెడీ నటుల వెనుక కూడా ఎన్నో కన్నీటి కథలు ఉంటాయని అవినాష్ మాటల్లో అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications