తనూజను ఎందుకు లాగుతున్నారు? నేనే బాధ్యురాలిని.. తిరుమల వివాదంపై దివ్వెల మాధురి
తిరుమలలో దివ్వెల మాధురి బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. తిరుమల కొండపై ఉన్న ఒక గెస్ట్‌హౌస్‌లో ఈ వేడుకలు నిర్వహించారు.కేక్ కట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ దివ్వెల మాధురి, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పేర్లు వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో దివ్వెల మాధురి తాజాగా ఒక వీడియో విడుదల చేసి పూర్తి వివరణ ఇచ్చింది. ఈ వివాదానికి తనుజకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో బాధ్యత అంతా తనదేనని స్పష్టం చేసింది.
ఎలా మొదలైంది వివాదం?
దివ్వెల మాధురి, తనుజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్లారు. తిరుమలలోని ఒక గెస్ట్ హౌస్‌లో ఆమె పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న కేక్ తీసుకెళ్లి కట్ చేయించారు.ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో విషయం పెద్ద వివాదంగా మారింది. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తీవ్రంగా స్పందించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ విషయంపై విచారణ ప్రారంభించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి.

నన్నే టార్గెట్ చేయండి.. తనుజను కాదు
ఈ వివాదం నేపథ్యంలో దివ్వెల మాధురి సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ మీడియా తనను లక్ష్యంగా చేసుకుని వార్తలు ప్రసారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. 'రాష్ట్రంలో వేరే సమస్యలు ఏవీ లేవన్నట్లుగా రెండు రోజులుగా అన్ని న్యూస్ ఛానల్స్‌లో నా పేరే వినిపిస్తోంది. నేను ఏదైనా పెద్ద నేరం చేసినట్టు చూపిస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేసినట్టు, పెద్ద మోసాలు చేసినట్టు వార్తలు చేస్తున్నారు' అంటూ ఆమె పేర్కొంది. తిరుమలలో కేక్ కట్ చేయకూడదన్న విషయం తనకు తెలియదని మాధురి చెప్పింది. 'నాకు ముందే తెలిసి ఉంటే ఎప్పుడూ ఇలాంటి పని చేసేదాన్ని కాదు. అనవసరంగా వివాదాల్లో పడాలని నేను కోరుకోను'అని చెప్పింది.
తనుజకు అసలు విషయం తెలియదు
ఈ ఘటనలో తనుజను లాగడం తగదని మాధురి స్పష్టం చేసింది.'తనుజ కేవలం శ్రీవారి దర్శనం కోసం మాత్రమే వచ్చింది. ఆమెకు కేక్ గురించి అసలు తెలియదు. ఆమెను సర్ప్రైజ్ చేయాలని నేను చిన్న ఎగ్‌లెస్ కేక్ తీసుకువచ్చాను. బయట అడిగితే తీసుకురావచ్చని చెప్పారు. అందుకే తీసుకొచ్చాను' అని వెల్లడించింది. తనుజ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేక్ కట్ చేయించానని మాధురి తెలిపింది. అంతేకాకుండా ఆమెకు చీర, మట్టి గాజులు, చెవి కమ్మలు వంటి బహుమతులు కూడా ఇచ్చానని చెప్పింది.
తప్పు జరిగి ఉంటే బాధ్యత నాదే
మాధురి వివరాల ప్రకారం.. మార్చి 4న తిరుమలకు వెళ్లి, మార్చి 5న ఉదయం 7.30 గంటల స్లాట్‌లో శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు తెలిపింది. దర్శనం పూర్తిగా నియమ నిష్టలతో చేసినట్లు కూడా ఆమె పేర్కొంది. 'మేము కూడా శ్రీవారి భక్తులమే. ఆలయానికి సంబంధించిన నియమాలు తెలిసి ఉంటే ఎప్పుడూ ఉల్లంఘించేవాళ్లం కాదు. దర్శనం చాలా భక్తితో చేసుకున్నాం' అని ఆమె వివరించింది. కేక్ కట్ చేయడం తప్పు అయితే అందుకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని మాధురి స్పష్టం చేసింది. 'కేక్ తీసుకువచ్చింది నేను. తనుజకు ఎలాంటి సంబంధం లేదు. ఆమెను ఈ విషయంలో మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు' అని ఆమె కోరింది.
ఇక తనుజను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కూడా ఆపాలని విజ్ఞప్తి చేసింది. 'మీరు ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే నాపై తీసుకోండి. కానీ తనుజను ఇందులోకి లాగకండి' అని చెప్పింది. ఈ వివాదం నేపథ్యంలో కేక్ పూర్తిగా ఎగ్‌లెస్ అని కూడా మాధురి స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన బిల్లు కూడా వీడియోలో చూపించింది. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించాలనే ఉద్దేశం తమకు లేదని, కేవలం పుట్టినరోజు సందర్భంగా చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేసినట్లు ఆమె తెలిపింది.
కేసులు పెట్టినా ఎదుర్కొంటా
మీడియా ఛానల్స్ ఈ విషయాన్ని పదేపదే ప్రసారం చేస్తున్నాయని మాధురి అసహనం వ్యక్తం చేసింది. 'మా మీద కేసులు పెట్టాలనుకుంటే పెట్టండి. కానీ అనవసరంగా తనుజను ఇందులోకి లాగకండి. మమ్మల్ని రాజకీయంగా టార్గెట్ చేయాలనుకుంటే నన్నే టార్గెట్ చేయండి' అని ఆమె వ్యాఖ్యానించింది. ఇలా తిరుమలలో జరిగిన కేక్ వివాదంపై దివ్వెల మాధురి ఇచ్చిన వివరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై టీటీడీ తదుపరి ఏ చర్యలు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











