బెట్టింగ్ యాప్స్ కేసు.. వెంటాడుతోన్న పోలీసులు.. హైకోర్టుకెక్కిన యాంకర్ శ్యామల
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ యాప్స్ ఉచ్చులో పడి అమాయకులు మోసపోవడంతో పాటు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నానాటికీ ఈ ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్స్‌ని సీరియస్‌గా తీసుకున్నారు. వీటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను టార్గెట్ చేశారు. తొలుత నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇప్పుడు యాక్షన్‌లోకి దిగడం దుమారం రేపుతోంది.
వెండితెర, బుల్లితెర సెలబ్రెటీలతో పాటు యూట్యూబర్లు ప్రమోట్ చేయడం వల్లే ఈ యాప్స్ జనంలోకి వెళ్తున్నాయని గ్రహించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు విచారణకు పిలుస్తున్నారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీప్రసన్న, నిధి అగర్వాల్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, విష్ణుప్రియ, శోభా శెట్టి, రీతూ చౌదరి, అమృత చౌదరి, సుప్రీత, పండు , హర్ష సాయి, సన్నియాదవ్, టేస్టీ తేజ, పండు, నేహా పటాన్ తదితరులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. వీరిలో విష్ణుప్రియ, రీతూ చౌదరిలను గురువారం పంజాగుట్ట పోలీసులు విచారణకు పిలిచి పలు అంశాలపై ఆరా తీశారు.

లోతుల్లోకి వెళ్లే కొద్ది ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక మరి కొంతమంది పేర్లు వినిపిస్తుండటం కలలకం రేపుతోంది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు సులభంగా డబ్బు సంపాదించే మార్గాలలో భాగంగా ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. డబ్బు సంపాదించాలంటే ఫలానా బెట్టింగ్ యాప్‌లో రిజిస్టర్ కావాలని వల విసరడంతో పాటు రూ.500 వరకు ఫ్రీ బోనస్ పాయింట్స్‌తో ఆశ కల్పిస్తున్నారు. వీటికి ఆకర్షితులై అటు వైపు వెళ్లాకా అసలు రూపం బయటపెడతారు. మొదట్లో కొద్ది మొత్తం గెలిచిన తర్వాత మరింత ఆశతో ఎక్కువ మొత్తాలకు ఆటలు ఆడి కోట్లలో డబ్బులు పోగొట్టుకున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) మొదలు కానుండటంతో వందల్లో కొత్త కొత్త బెట్టింగ్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిని సెలబ్రెటీలతో ప్రమోట్ చేయించి క్యాష్ చేసుకోవాలని కేటుగాళ్లు ఉచ్చు బిగిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, వీటి వెనుక ఉన్న అసలు కేటుగాళ్లు, దీనిని రూపొందిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను నియంత్రిస్తేనే ఫలితం ఉంటుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అయితే సెలబ్రెటీల నుంచి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎవరు? ప్రమోట్ చేసినందుకు ఎంత మొత్తం తీసుకున్నారు? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదే వ్యవహారంలో యాంకర్ శ్యామల పేరు కూడా తెరపైకి రావడంతో ఆమెను కూడా పోలీసులు విచారిస్తారని వార్తలు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్ కేసులో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌అలో శ్యామల పేరుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో ఏ క్షణంలోనైనా ఆమెను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. దీంతో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో శ్యామల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. దీంతో కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? శ్యామలకు ఊరట లభిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











