చివరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు పవిత్ర జయరాం .. ‘తిలోత్తమ ’తీరని డ్రీమ్ ఏమిటో తెలుసా?
కన్నడ నటి, త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్రా జయరాం అకాల మరణం ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అద్భుతమైన నటనతో , ఎంతో భవిష్యత్తు వున్న ఆమె చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోవడం అందరినీ కలిచివేసింది. కర్ణాటకకు చెందిన పవిత్రా జయరాం హైదరాబాద్‌లో వుంటూ పలు తెలుగు సీరియల్స్‌లో నటిస్తోంది. ఇటీవల ఆమె తన స్వగ్రామానికి వెళ్లింది. మే 12వ తేదీ తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా.. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఇంతలో కుడివైపు నుంచి వనపర్తి వస్తున్న వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో పవిత్ర జయరాం ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆమె తీరని కోరిక విషయం మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
త్రినయని సీరియల్‌లో లేడీ విలన్‌గా అద్భుతమైన నటనను చూపిన పవిత్ర జయరాం .. నిజ జీవితంలో చాలా సాఫ్ట్. ఈ విషయాన్ని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మరణించడానికి ముందు పవిత్ర ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. తెలుగువారే కాదు.. కర్ణాటకలోనూ తనను అంతా తిలోత్తమ అనే పిలుస్తారని చెప్పారు. ఇండస్ట్రీలో అడుగుపెడతాను, ఓ నటిని అవుతానని తాను ఎప్పుడూ అనుకోలేదని.. ఇంట్లో ఆర్ధిక పరిస్ధితులు, నోట్లోకి నాలుగు వేళ్లు వెలితే చాలు అన్న ఆలోచనే తనను ఈ వైపు నడిపించాయని పవిత్ర అన్నారు.

దర్శకత్వం అంటే తనకు చాలా ఇష్టమని తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నటిగా మారానని, పాటలను డైరెక్ట్ చేయడం ప్రారంభించానని ఆమె తెలిపారు. యాక్టింగ్ రాకపోతే.. డైరెక్టర్లు తిట్టేవారని కానీ రాను రాను కసితో అంతా నేర్చుకున్నానని పవిత్ర గుర్తుచేశారు. కొన్ని సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని.. ఆ సమయంలో అమ్మ తనకు ధైర్యం చెప్పారని తెలిపారు. కష్టంలో వున్న వారికి చేతనైనంత సాయం చేస్తే .. దానికి డబుల్ మనకి తిరిగొస్తుందని తాను నమ్ముతానని, పిల్లలకు కూడా అదే చెప్పానని పవిత్ర వెల్లడించారు.
తెలుగు రాక ఎంతో ఇబ్బందిపడ్డ నేను ఇప్పుడు తెలుగులోనే సాంగ్స్ డైరెక్ట్ చేస్తున్నానని.. ఎలాంటి ప్రాప్టింగ్ లేకుండానే నేను డైలాగ్స్ చెప్పగలనన్నారు. మొదటిసారిగా ఆల్టో కారు కొన్నప్పుడు జీవితంలో ఏదో సాధించానన్న గర్వం అనిపించిందని ఆమె గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో నటించడం తనకు ఎంతో ఇష్టమని.. కానీ సీరియల్స్ చేసేవాళ్లకు డేట్స్ కుదరవని పవిత్ర ఆవేదన వ్యక్తం చేశారు.

త్రినయని సీరియల్ తనకు దేవుడిచ్చిన వరమని, 1000 ఎపిసోడ్స్ క్రాస్ చేసినా అది టాప్‌లో కొనసాగుతోందన్నారు. డైరెక్టర్ పవిత్రా జయరాం అనే పేరు తెచ్చుకోవాలన్నది తన కల అని ఆమె తెలిపారు. మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళితే.. ఏదైనా సాధ్యమేనని, ఓడిపోతే గుణపాఠంగా, గెలిస్తే అచీవ్‌మెంట్ అవుతుందన్నారు. కన్నడ, తెలుగు ఇండస్ట్రీలకు జీవితంలో ఎప్పుడూ తాను రుణపడి ఉంటానని పవిత్ర చెప్పారు.


Click it and Unblock the Notifications











