ఈ సమాజం టార్చర్ పెట్టింది .. బాగా బతుకుదాం అనుకుంటుండగా : చంద్రకాంత్ చివరి ఇంటర్వ్యూలో కంటతడి
సీరియల్ నటి , త్రినయని ఫేమ్ పవిత్ర జయరాం ఆకస్మిక మరణం నుంచి కోలుకోకముందే తెలుగు టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. పవిత్ర ప్రియుడు , సీరియల్ నటుడు చల్లా చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. గత కొన్నేళ్లుగా పవిత్ర జయరాంతో సహజీవనంలో ఉన్నాడు. గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో చందు కూడా ఉండగా.. ఆయన గాయాలతో బయటపడ్డారు. అయితే పవిత్రను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న చందు.. ఆమె తన కళ్లేదుటే ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోయాడు. నాటి నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లిన చందు ఆమెతో గడిపిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నాడు.

ఆత్మహత్యకు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు చంద్రకాంత్ ఇంటర్వ్యూ ఇచ్చి ఎమోషనల్ అయ్యారు. దేవుడు తనకు బదులుగా నన్ను తీసుకెళ్లినా బాగుండేదన్నారు. పవిత్రపై తనకు ప్రేమ ఎలా ఏర్పడిందో కూడా ఈ సందర్భంగా వివరించారు. ఓ ప్రాజెక్ట్‌లో ఇద్దరం విలన్స్‌గా చేస్తున్నాం.. అప్పుడు రాత్రి 9.30కి హీరో ఫ్లైట్‌లో వెళ్లిపోవాల్సి ఉందన్నారు. కేక్ కట్ చేస్తున్న హీరోయిన్ కొంగుకి తాము మంట పెట్టాల్సిన సీన్ చేయాలని .. సహజంగానే హీరోయిన్‌కు చేసేటప్పుడు ఖచ్చితంగా ప్లాన్ రివర్స్ అయి విలన్‌కి ఏదో ఒకటి జరుగుతుందని చంద్రకాంత్ చెప్పారు.
దీనిలో భాగంగా పవిత్ర చీరకు మంట పెట్టాల్సి ఉందని.. అయితే ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు పనితెలియని ఓ కుర్రాడని పెట్టుకున్నారని గుర్తుచేశారు. టీపాయ్ దగ్గర కూర్చొని రెడి రెడి అంటున్నాడని.. సీన్ కోసం చీర కొంగుకి కాస్త పెట్రోల్ పూస్తారని, కానీ ఆ కుర్రాడు చాలా భాగాన్ని స్పిరిట్‌లో ముంచాడని చెప్పారు. మంట చూస్తే ఎవరైనా భయపడతారని.. ఓ పక్క హీరో ఫ్లైట్‌కి టైం అవుతోందని, సీన్ పూర్తి కాలేదని చంద్రకాంత్ వెల్లడించారు. చివరికి ఆ కుర్రాడు మంట పెట్టగా.. అది మనిషంత ఎత్తులో లేచిందని అప్పుడు చుట్టూ 15 మంది వరకు ఉన్నారని వాళ్లంతా నోటితో మంటను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.

మంట కారణంగా పవిత్ర స్పృహ తప్పారని.. నేను నిప్పును ఆర్పేసి, తన చెంపపై రెండు సార్లు కొట్టడంతో బ్రీతింగ్ తీసుకుందని చంద్రకాంత్ గుర్తుచేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించామని అప్పుడు ఆ సమయంలో డాక్టర్ ఆమె చెంపపై చేతి వేళ్ల గుర్తును చూసి అడగ్గా.. నేనే కొట్టానని నాపై కంప్లయింట్ చేశారని చంద్రకాంత్ వివరించారు. ఆ అబ్బాయి కొట్టడం వల్లే ఈమె బతికిందని చెప్పారని.. అక్కడే తమ బంధం ప్రారంభమైందని ఆయన తెలిపారు. వీడు నా ప్రాణాలు కాపాడాడు, ఏమైనా చేద్దామని తను అనుకుందని అంతేతప్ప తమ మధ్య అప్పుడు ఏ రిలేషన్ లేదని చంద్రకాంత్ అన్నారు.
ట్రీట్‌మెంట్ పూర్తయి తను కోలుకున్నాక.. షూటింగ్‌కి వచ్చిందని , తిన్నావా అని కనిపించినవాళ్లని అడగటం తెలుగువారి సాంప్రదాయమని అలాగే పవిత్రను కూడా తిన్నావా, టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగానని ఆయన చెప్పారు. నిన్న ప్రాణాలు కాపాడి, ఇవాళ కేరింగ్ తీసుకుంటున్నాడని తనకు నెమ్మదిగా తనపై ఇష్టం మొదలైందని చంద్రకాంత్ చెప్పారు. తర్వాత నా హెల్త్ విషయంలో కేర్ తీసుకోవడం మొదలుపెట్టి, అది బంధంగా మారిందని.. ఇరు కుటుంబాలు దానిని తప్పుగా అర్ధం చేసుకున్నాయని కొంచెం టైం అడిగినా వాళ్లు వినిపించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో ఎనో ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. పవిత్రతో నాకున్నది రిలేషన్ కాదని, ఆమె తన జీవితమని స్పష్టం చేశారు. సమాజం పెట్టే టార్చర్ తట్టుకుని బాగా బతుకుదాం అనుకున్న టైంలో పవిత్ర లేదని చంద్రకాంత్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











