ప్రముఖ నటుడి ఇంట్లో విషాదం...రెండేళ్ల కూతురు ప్రాణం తీసిన బొమ్మ!
ప్రముఖ హిందీ టీవీ నటుడు ప్రతీష్ వోరా ఇంట్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండేళ్ల కూతురు బొమ్మ కారణంగా ప్రమాదవశాత్తు మరణించింది. ఇంట్లో ప్లాస్టిక్ బొమ్మతో ఆడుకుంటూ దాన్ని నోట్లో పెట్టుకోవడంతో అది గొంతులో ఇరుక్కుంది. దీంతో చిన్నారి స్వాస ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఈ విషయమై ప్రతీష్ వోరా ఓ హిందీ ఛానల్‌తో మాట్లాడుతూ... బుధవారం రాత్రి బొమ్మతో ఆడుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుందని, గొంతులో బొమ్మ ఇరుక్కోవడం వల్ల ఇలా జరిగినట్లు వెల్లడించారు. తన కూతురు కోసం అంతా ప్రార్థించాలని కోరారు.

రాజ్‌కోట్‌లో ఖననం
ముంబైకి చెందిన ఓ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం... ఈ ప్రమాదం బుధవారం చోటు చేసుకుందని, గురువారం అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు. సంఘటన జరిగిన మర్నాడు ఉదయమే విమానంలో ప్రతీష్ వోరా దంపతులు ఇద్దరూ రాజ్‌కోట్ వెళ్లారని, అక్కడే తమ కూతురు భౌతిక ఖాయాన్ని ఖననం చేసినట్లు తెలుస్తోంది.

ఊహించని ఘటనతో విషాదం
ఈ ఊహించని ఘటనతో ప్రతీష్ వోరా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తమకు దూరం కావడంతో దంపతులిద్దరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ విషాద సంఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది.

పర్యవేక్షణ లేకుంటే ప్రమాదమే
పిల్లలు ఆడుకునే సమయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా ఊహ తెలియని వయసులో ఉన్న చిన్నారులపై అనుక్షణం కన్నేసి ఉంచాలి. మనం నిర్లక్ష్యం చేస్తే ప్రతీష్ ఇంట్లో జరిగినట్లే పిల్లలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.

ప్రతీష్ వోరా
హిందీ టెలివిజన్ రంగంలో బాగా పాపులరిటీ పొందిన నటుల్లో ప్రతీష్ వోరా ఒకరు. ప్రస్తుతం స్టార్ భారత్‌లో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ డ్రామా ‘ప్యార్ కె పాపడ్' అనే కార్యక్రమంలో నటిస్తున్నాడు. ఈ షోలో నందు గుప్తా అనే పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పాటు తారక్ మెహతా కా ఓల్టాహ్ చెస్మా, క్రైమ్ పాట్రోల్ కార్యక్రమాల్లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











