టార్చర్ పెట్టాడు, ఒకే కులం కాదు, నా కూతురు చావుకు కారణం అతడే: టీవీ నటి ఝాన్సీ తల్లి
పవిత్ర బంధం సిరీయల్‌లో నటించిన బుల్లితెర నటి ఝన్సీ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో సంచలనం అయింది. శ్రీనగర్ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో ఝాన్సీ ఉరి వేసుకున్నారు. సూర్య అలియాస్ నాని అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం వల్లనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గత ఆరు నెలలుగా ఝాన్సీ, సూర్య ప్రేమించుకుంటున్నారు. సూర్యతో ప్రేమలో పడ్డ తర్వాత సీరియల్స్‌లో నటించడం మానేసింది. కారణం ఏమిటో తెలియదు కానీ కొంతకాలంగా ఝాన్సీని అతడు దూరం పెట్టాడు. దీంతో తాను ప్రేమలో మోసం పోయానని మనోవేదనకు గురైన ఝాన్సీ తన అపార్టుమెంటులో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా ఈ ఘటనపై ఆమె తల్లి స్పందించారు.

ఆరు నెలల క్రితమే పరిచయం అయ్యాడు
నాని అనే అబ్బాయితో మా అమ్మాయికి పరిచయమై ఆరునెలలు అయింది. అతడిది విజయవాడ. మధు అనే మరో సీరియల్ నటి ద్వారా పరిచయం అయ్యాడు. మూడు నెలల క్రితమే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వాళ్ల ఇంటికి కూడా తీసుకెళ్లాడు. ఇంట్లో వారిని ఒప్పించి పండగ వెళ్లాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఝాన్సీ తల్లి తెలిపారు.

నా కూతురు మీద చేయి చేసుకున్నాడు
ఒకసారి మా ఇంటికి వచ్చి నా కూతురుని టార్చర్ పెట్టాడు. ఫోన్లో నరకవేద చూపించేవాడు. ఎవరి నుంచి ఫోన్లు రాకుండా వేధించాడు. ఓ సారి మా ఇంటికి వచ్చి చేయి కూడా చేసుకున్నాడు. మా పిల్ల మీద చేయి చేసుకోవడానపికి నువ్వు ఎవరు? అంటే నా మీద తిరగబడ్డాడు. నేను అతడిని తోసి పంపించేశాను.

అతడి కోసం నటించడం మానేసింది
మేము పండక్కి పిల్లలతో కలిసి మా ఊరు వెళ్లాం. మూడు రోజుల క్రితమే నా కూతురు హైదరాబాద్ వచ్చింది. నేను అక్కడే ఉన్నాను. ఫోన్‌లో ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అతడు వద్దంటే పవిత్ర బంధం తర్వాత నటించడం మానేసిందని తెలిపారు.

ఒకే కులం కాదు...
అతడు మా కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి కాదు సీరియల్ అమ్మాయి ద్వారా పరిచయం అయ్యాడు. వారి ప్రేమ విషయం నాకు మూడు నెలల క్రితమే చెప్పారు. ఒకే కులం కాదు.. మీ పెద్దోళ్లు ఒప్పుకుంటే చేసుకోండి, లేకుంటే వద్దని చెప్పాను. నా కూతురు చావుకు కారణం అతడే.. అని ఝాన్సీ తల్లి కన్నీరుమున్నీరయ్యారు.

వాట్సాప్ చాటింగ్ ఆధారంగా విచారణ
సూర్య అలియాస్ నానితో ఝాన్సీ వాట్సాప్ చాట్ చేశారు. ప్రేమ వ్యవహారంలో ఏర్పడ్డ విబేధాలే ఆత్మహత్యకు కారణమని గుర్తించారు. దీంతో పోలీసులు ఆమె సెల్ ఫోన్ సీజ్ చేశారు. ఈ కేసుపై వివిధ కోణాలల్లో దర్యాప్తు జరుపుతున్నారు.


Click it and Unblock the Notifications











