ఇండస్ట్రీలో కంపు కాంపౌండ్స్.. ఉదయభాను షాకింగ్ కామెంట్స్
తెలుగు బుల్లితెరపై యాంకర్ అనే పదానికి పర్యాయ పదంగా నిలిచారు ఉదయభాను. అందం, చలాకీతనంతో ఓ దశాబ్ధం పాటు యాంకర్‌గా ఏలారు. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు ఇలా ఎక్కడ చూసినా ఉదయభానునే కనిపించేవారు. ఇటీవలి కాలంలో మళ్లీ యాక్టీవ్ అయ్యారు. తనను టాలీవుడ్‌లో తొక్కేశారని ఉదయభాను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో పరిణామాలు గతంలో మాదిరిగా లేవని పూర్తిగా మారిపోయాయని ఉదయభాను వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సినిమాలతో ఎంట్రీ
నవంబర్ 6, 1972న కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో జన్మించారు ఉదయభాను. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే, ఈమెకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. తొలుత సినీరంగంలో ఉదయభానుకు అవకాశాలు వచ్చాయి. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన ఎర్ర సైన్యంలో ఆమె నటించారు. ఆ తర్వాత కొండవీటి సింహాసనం, ఖైదీ బ్రదర్స్, శ్రవణ మాసంతో పాటు పలు కన్నడ , తమిళ చిత్రాల్లోనూ ఉదయభాను తళుక్కున మెరిశారు.

తెలుగునాట యాంకర్‌గా స్టార్‌డమ్
ఆ సమయంలో బుల్లితెర రంగం భారతదేశంలో విస్తరిస్తున్న దశలో టీవీ భవిష్యత్తును ఊహించిన ఉదయభాను.. యాంకర్‌గా మారారు. తెలుగు బుల్లితెరపై తొలి తరం యాంకర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. హృదయాంజలి, వన్స్ మోర్ ప్లీజ్ తదితర కార్యక్రమాలతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. యాంకర్ అంటే ఉదయభాను.. ఉదయభాను అంటే యాంకర్ అన్నంతగా ముద్ర వేసుకుంది. సినిమా ఈవెంట్స్, టీవీ కార్యక్రమాలు, నటనతో ఆమె పీక్స్ చూశారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఉదయభాను ఆకస్మాత్తుగా మాయమైపోయారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆశ్చర్యపరిచారు. మిద్దె విజయేంద్ర మౌళి అనే వ్యక్తిని పెళ్లాడిన ఉదయభానుకి ఇద్దరు కుమార్తెలు. భూమి ఆరాధ్య , యువి నక్షత్ర. ప్రస్తుతం భర్త , పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
బాలయ్య బాబు దేవుడు
ఇటీవలి కాలంలో వరుస సినిమాలు చేస్తున్న ఉదయభాను.. ప్రతినిధి 2, త్రిబాణధారి బార్బరిక్ సినిమాలలో నటించారు. ఓ సినిమా ప్రమోషన్ సందర్బంగా ఉదయభానుని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు మీ మీద ఇంపాక్ట్ పడిందా అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి ఆమె తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. ముక్కుసూటిగా మాట్లాడతాను కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది అలా గిరిగీసుకున్నారు. బాలయ్య బాబు గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయనే దేవుడు అన్నట్లుగా మాట్లాడతా. అలాగని ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను. బాలయ్య బాబుగారితో వ్యక్తిగతంగా అనుబంధం ఉంది. ఆయనేంటో నేను చూశాను. సంతోషం అవార్డ్స్ మొదటి నుంచి చేశాను.. ఆయన ఎటువంటి బిల్డప్స్ చూపించరు అని ఉదయభాను చెప్పారు.
ఈ కాంపౌండ్స్ ఏంట్రా బాబు
చిన్నచిన్న స్టార్స్ కూడా పది మందిని వేసుకొచ్చి వెళ్లాలని వాచ్ చూసుకుంటూ ఉంటారు. కానీ ఆర్టిస్ట్స్ చాలామంది ఉన్నారంటే బాలయ్య కూర్చేవారు. సంతోషం అవార్డ్స్ అప్పుడు కూడా బోకేని మోకాలిపై కూర్చొని ఇచ్చాను. నాకు ఏదైనా మంచి కనిపిస్తే మనస్పూర్తిగా ప్రశంసిస్తా. ఆయన గురించి మాటల్లో చెప్పలేను.. ఇటీవల నా బిడ్డల్ని పరిచయం చేస్తే నా కోడళ్లు ఇంత పెద్దవాళ్లు అయిపోయారా? అని మోకాళ్ల మీద కూర్చొని వాళ్లతో ఫోటోలు దిగారు. ఆ ప్రేమ నా ఫ్యామిలీ నుంచి కూడా నాకు దొరకలేదు. ఎలాంటి కల్మషం లేని, అంత గొప్ప వ్యక్తి అంత ప్రేమ చూపిస్తుంటే ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటాం. నాకు బాలయ్య బాబంటే చాలా ఇష్టం.. నేను ఏం చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు కూడా బాలయ్య గారు ప్రోత్సహించారు. బాలకృష్ణ నాకు సోదరుడు.. నా బిడ్డలకైతే మామ. ఇండస్ట్రీలో కాంపౌండ్స్ ఉన్నాయని ఇంటర్వ్యలకు వెళ్తుంటే తెలిసింది.. ఈ కాంపౌండ్, ఆ కాంపౌండ్ అంటున్నారు. ఈ కంపు కాంపౌండ్లు ఎవరు కట్టార్రా బాబు అంటూ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











