ఏ యాంకర్‌ని వదలరు .. టాలీవుడ్‌లో సిండికేట్‌పై మరో బాంబు పేల్చిన ఉదయభాను
ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందారు ఉదయభాను. అందం, వాక్చాతుర్యం, సమయస్పూర్తి ఇలా ఏ విషయంలోనైనా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కానీ ఎంత వేగంగా టాప్ ప్లేస్‌కి వెళ్లారో? అంతే వేగంగా పాతాళానికి పడిపోయారు. టాలీవుడ్‌లో సిండికేట్ తయారైందని, ఇంకో ఈవెంట్ చేస్తానో లేదో? అని ఉదయభాను కొద్దిరోజుల క్రితం చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తాజాగా ఈ సీనియర్ యాంకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఈ వివరాల్లోకి వెళితే..
స్టార్ యాంకర్‌గా ఉదయభాను వైభవం
ఒకప్పుడు తెలుగు నాట యాంకరింగ్ అన్నా.. యాంకర్ అన్నా ముందుగా గుర్తొచ్చే పేరు ఉదయభాను. ఇప్పుడు స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న సుమ కనకాల కన్నా ఉదయభాను సీనియర్. 30 ఏళ్ల కిందట టాలీవుడ్‌లో ఏ టెలివిజన్ అయినా, ఏ సినిమా ఈవెంట్ అయినా ఉదయభాను ఉండాల్సిందే. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి కార్యక్రమంతో యాంకరింగ్ మొదలుపెట్టారు ఉదయభాను. ఆ తర్వాత దివంగత కమెడియన్ వేణుమాధవ్‌తో కలిసి ఆమె చేసిన వన్స్‌మోర్ ప్లీజ్ షో సంచలనం సృష్టించింది.

సినిమాలతోనూ పాపులర్
యాంకర్‌గా ఉన్న రోజుల్లోనే ఉదయభానుకు సినిమాల్లో ఆఫర్లు కూడా వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో ఆమె నటించారు. నటిగానే కాకుండా ఐటెం సాంగ్స్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు ఉదయభాను. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ మాస్‌ను ఊపేసింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే వెండితెరకు, బుల్లితెరకు క్రమక్రమంగా దూరమైపోయింది ఉదయభాను. విజయేంద్ర మౌళి అనే వ్యక్తిని ఉదయభాను పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడుతున్న ఉదయభాను తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి వీడియోలు చేస్తున్నారు.
రేపు ఈవెంట్ ఉంటుందో? ఉండదో?
గతేడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఓ బహిరంగసభకు వ్యాఖ్యాతగా వ్యవహరించి షాకిచ్చింది ఉదయభాను. అడపా దడపా కొన్ని మూవీ ఈవెంట్స్ చేస్తూ కనిపిస్తున్నారు ఈ స్టార్ యాంకర్. కొద్దిరోజుల క్రితం సుహాస్ నటించిన ఓ భామ అయ్యో రామ సినిమా ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఈమె సంచలన వ్యాఖ్యలు చేసింది. మరో ఈవెంట్ చేస్తానన్న గ్యారెంటీ లేదని బాంబు పేల్చారు. రేపు ఈవెంట్ ఉంటుందని ప్రిపేర్ అవుతుండగా.. సడెన్‌గా ఆ ఈవెంట్ చేజారిపోతుందని, ఇండస్ట్రీలో సిండికేట్ తయారైందని ఉదయభాను సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
త్రిబాణధారి బార్బరిక్‌లో కీలకపాత్ర
తాజాగా ఈ సిండికేట్‌ను ఉద్దేశించి మరోసారి వ్యాఖ్యలు చేశారు ఉదయభాను. కోలీవుడ్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమాలో ఉదయభాను కీలకపాత్ర పోషిస్తున్నారు. డైరెక్టర్ మారుతి సమర్పణలో వాన సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఉదయభాను చేసిన ఇస్కితడి ఉస్కితడి అనే ఐటెం సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, క్రాంతి కిరణ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
నిజాలు మాట్లాడతా
ఆగస్ట్ 22న త్రిబాణధారి బార్బరిక్ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో సిండికేట్‌పై ఆమెకు మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఉదయభాను మాట్లాడుతూ.. తానెప్పుడూ నిజాలే మాట్లాడతానని, దీని గురించి ఏ యాంకర్‌ని అడిగినా చెబుతారని ఆమె బాంబు పేల్చింది. అయితే ఆ వ్యవహారం గురించి స్పందించడానికి ఇది సమయం కాదని ఉదయభాను తెలిపారు.


Click it and Unblock the Notifications











