యాంకరింగ్‌లో సిండికేట్.. మరో ఈవెంట్ చేస్తానో? లేదో.. ఉదయభాను షాకింగ్ కామెంట్స్
ఉరుకుల, పరుగుల జీవితంలో పక్కోడిని తొక్కేసైనా మనం పైకి రావాలి అనే మనస్తత్వం ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. అన్ని రంగాల్లోనూ ఇబ్బందులు పెట్టేవారు, అవకాశాలు లాక్కునేవారు ఎందరో. సినీ పరిశ్రమలో ఎత్తులు పైఎత్తులు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ రాజకీయాలకు ఎందరో ప్రతిభావంతులు బలైపోయారు. సినీ రంగమే కాదు.. బుల్లితెరపైనా ఇదే స్థాయిలో రాజకీయాలు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు స్టార్ యాంకర్ ఉదయభాను.
స్టార్ యాంకర్‌గా వెలిగిన ఉదయభాను
తెలుగునాట టెలివిజన్ రంగం అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తున్న దశలో యాంకరింగ్‌కు కేరాఫ్‌గా నిలిచారు ఉదయభాను. తన అందం, ఫిగర్, టాలెంట్‌తో అప్పట్లో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టారు. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, సెలబ్రెటీ ఇంటర్వ్యూలతో దూసుకెళ్లారు. ప్రస్తుతం స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న సుమ కనకాల కంటే కూడా ఉదయభాను సీనియర్. తొలుత సినీరంగంలో ప్రవేశించిన ఉదయభాను.. ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఎర్రసైన్యంలో నటించారు. ఆ తర్వాత కొండవీటి సింహాసనం, ఖైదీ బ్రదర్స్, శ్రవణ మాసంతో పాటు పలు కన్నడ, తమిళ చిత్రాలలో ఉదయభాను నటించారు.

బుల్లితెర నుంచి మాయం
సినీ నటిగా కంటే యాంకర్‌గే తనకు సెట్ అవుతుందని గ్రహించిన ఉదయభాను.. తొలుత ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి కార్యక్రమంతో తెలుగునాట పాపులర్ అయ్యారు. తర్వాత అప్పటి స్టార్ కమెడియన్ వేణు మాధవ్‌తో కలిసి ఆమె చేసిన వన్స్‌మోర్ ప్లీజ్ షో ఉదయభానుకు మరింత స్టార్‌డమ్ తీసుకొచ్చింది. మధ్యలో లీడర్ మూవీలో ఐటెం సాంగ్ చేసిన ఉదయభాను .. క్రమక్రమంగా యాంకరింగ్‌కు, సినీ పరిశ్రమకు కూడా దూరమైపోయింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో ఆమె ఏమైపోయిందనేది అంతు చిక్కలేదు.
టీడీపీ సభలో ప్రత్యక్షం
గతేడాది తెలుగుదేశం పార్ట నిర్వహించిన బీసీ గర్జన కార్యక్రమంలో ప్రత్యక్షమైన ఉదయభాను సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గడిచిన ఐదేళ్లుగా ఏ టీవీలోనూ కనిపించలేదని.. నన్ను తొక్కడానికి ప్రయత్నించారని వ్యాఖ్యానించింది. ఓ ఛానెల్‌లో యాంకరింగ్ చేసే సమయంలో తాను పాడిన పాట వల్లే అవకాశాలు తగ్గిపోయాయని ఆరోపించింది. విజయేంద్ర మౌళి అనే వ్యక్తిని ఉదయభాను పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న ఉదయభాను .. ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి వ్లాగింగ్ చేస్తున్నారు. అడపా దడపా కొన్ని మూవీ ఈవెంట్స్ చేస్తూ కనిపిస్తున్నారు ఈ స్టార్ యాంకర్.
యాంకరింగ్‌లో సిండికేట్
తాజాగా యువ హీరో సుహాస్ నటించిన ఓ భామ అయ్యో రామ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయభాను హోస్ట్‌గా విచ్చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల.. స్టేజ్‌పై ఉదయభానును చూసి షాకయ్యాడు. మైక్ అందుకుని మాట్లాడుతూ.. ఉదయభాను గారు చాలా రోజుల తర్వాత ఈవెంట్ చేస్తున్నారని అన్నారు. వెంటనే ఉదయభాను మైక్ అందుకుని.. ఇదొక్కటే చేశానని, మరో ఈవెంట్ చేస్తానన్న గ్యారెంటీ లేదని వ్యాఖ్యానించారు. రేపు ఈవెంట్ ఉంటుందని దానికి కోసం ప్రిపేర్ అవుతుండగా.. సడెన్‌గా ఆ ఈవెంట్ చేజారిపోతుందని అంత పెద్ద సిండికేట్ ఎదిగిందని ఉదయభాను సంచలన వ్యాఖ్యలు చేశారు. సుహాస్ మా బంగారం కాబట్టి ఈ ఈవెంట్ చేశానని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











