అర్బన్‌లో ‘హిట్’అక్కడ మాత్రం.. కారణం అదేనా?
విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన హిట్ చిత్రం వెండితెరపై అందర్నీ ఆకట్టుకుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు కాస్త కొత్త ఫీలింగ్ వచ్చినా.. హాలీవుడ్ చిత్రాలను చూసే ప్రేక్షకులకు సాధారణంగానే అనిపించవచ్చు. ఏది ఏమైనా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటూ వస్తున్న నాని..రెండో చిత్రంగా హిట్‌ను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ చిత్రాన్ని గత వారం టీవీలో ప్రసారం చేశారు. వెండితెరపై సత్తా చాటిన హిట్.. బుల్లితెరపై తేలిపోయింది.
ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో హిట్ దుమ్ములేపగా బుల్లితెరపై బోల్తా పడింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా, మేడే కానుకగా ప్రైమ్ టైమ్ లో జెమినీ టీవీలో ప్రసారమైన హిట్ సినిమాకు కేవలం 5.07 టీఆర్పీ (అర్బన్+రూరల్) వచ్చింది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రసారమైన రాక్షసుడు, రేసుగుర్రం లాంటి సినిమాలకు హిట్ కంటే ఎక్కువ రేటింగ్ వచ్చింది. ఉన్నంతలో అర్బన్ ఆడియన్స్ (7.23) ఈ సినిమాకు ప్లస్ అయ్యారు. రూరల్ ప్రేక్షకులు హిట్ సినిమాను అస్సలు పట్టించుకోలేదు.

అయితే హిట్ చిత్రం థ్రిల్లర్ జానర్ కావడం, వెండితెరపై బాగానే రన్ కావడం, అమెజాన్ ప్రైమ్‌లోనూ విపరీతమైన ఆదరణ రావడంతో బుల్లితెరపై హవా చూపించలేకపోయిందని తెలుస్తోంది. ఏది ఏమైనా లాక్ డౌన్ మూలంగా టీవీ వీక్షకుల సంఖ్య పెరిగిందని బార్క్ లెక్కలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











