IMDBలో టాప్ రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమా.. బహుబలి2 రికార్డ్స్ బ్రేక్ చేసి టాప్ 1గా నిలిచి..!
బాలీవుడ్‍లో చిన్న చిత్రంగా వచ్చిన '12th ఫెయిల్' సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. కలెక్షన్లతో పాటు చాలా ప్రశంసలు దక్కించుకుని ట్రెండింగ్ లో నిలిచింది. చాలా మందిలో స్ఫూర్తిని నింపిన మంచి చిత్రంగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డును సాధించింది. '12th ఫెయిల్' డిజిటల్ ప్లాట్ ఫాంపై అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తుండగా... ప్రముఖ ఐఎండీబీలో కూడా అత్యధిక రేటింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. బహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది ఈ మూవీ. ఆ వివరాల్లోకి వెళితే...
'12th ఫెయిల్ సినిమా గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ లో చిన్న చిత్రంగా వచ్చిన ఈ రియల్ స్టోరీకి అందరూ కనెక్ట్ అయిపోతున్నారు. పేదరికాన్ని దాటి, ఓ దశలో 12వ తరగతి ఫెయిల్ అయినా ఆ తర్వాత కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయిన మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు.. గతేడాది (2023) అక్టోబర్ 27న హిందీలో 12th ఫెయిల్ సినిమా విడుదల అయి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

హిందీలో మంచి రెస్పాన్స్ రావడంతో... తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో నవంబర్ 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేశారు. తెలుగులోనూ ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఇటీవలే 12th ఫెయిల్ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాగా.. ఓటీటీలో ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఇప్పుడు ఈ సినిమా కోసం సినీ లవర్స్... ఓటీటీలో వెతికి మరీ చూస్తున్నారు. దీంతో డిజిటల్ ప్లాట్ ఫాంపై అత్యధిక వ్యూస్ తో ఈ సినిమా దూసుకెళ్తుంది.
ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోషిల జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించగా.. ఇందులో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, అనంత్ విజయ్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం సినీ లవర్స్ దృష్టి ఈ సినిమాపైనే ఉంది. అయితే డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా.. కేవలం హిందీలోనే విడుదల చేశారు. తెలుగు వర్షన్ రిలీజ్ చేయాలని.. నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. '12th ఫెయిల్' సినిమా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ IMDBలో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా చోటు దక్కించుకుంది. మొత్తం 46,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధారంగా 10కి 9.2 రేటింగ్‌తో IMDbలో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ మూవీగా 12th ఫెయిల్ నిలిచింది. త్రీ ఇడియట్స్, దంగల్, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల రేటింగ్స్ సైతం ఈ సినిమా బ్రేక్ చేసింది.

అంతేకాదు గతేడాది విడుదలైన హాలీవుడ్ మూవీస్ స్పైడర్ మ్యాన్.. అక్రాస్ ది స్పైడర్ వెర్స్ , ఓపెన్ హైమర్ , గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 లాంటి చిత్రాల ఐఎండీబీ రేటింగ్ కంటే ఎక్కువ రేటింగ్ ఈ సినిమా సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. ఇండియన్ టాప్ 250 సినిమాల్లో '12th ఫెయిల్' మూవీ మొదటి స్థానంలో నిలిచి విజయవంతంగా దూసుకుపోతుంది. మీరు గనుక ఈ సినిమాను మిస్ అయితే ఓటీటీలో చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











