రికార్డు టైంలో '7 డేస్ 6 నైట్స్' షూట్ పూర్తి.. పక్కా హిట్ అంటున్న దర్శకనిర్మాత!!
ఈ కరోనా మొదలయ్యాక అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా బాగా దెబ్బతిన్నది. మరీ ముఖ్యంగా సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా సినిమాలు విడుదల చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో షూటింగ్ జరిపే విషయంలో కూడా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకున్న దాఖలాలు లేవు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మెస్ రాజు రూపొందిస్తున్న సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ అనే సినిమాని క్లిష్ట పరిస్థితుల్లో రికార్డు స్థాయి సమయంలో షూటింగ్ పూర్తి చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మన వాళ్ళు ఎక్కువగా షూటింగ్ జరిపే కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి ప్రాంతాల్లో కూడా నిబంధనలు పూర్తిస్థాయిలో సడలించ లేదు. మరీ ముఖ్యంగా షూటింగ్ లాంటి వాటికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు అనేక పరిమితులు, నిబంధనలు విధిస్తున్నారు.
ఆ పరిమితులు అన్నిటినీ పాటిస్తూ నిబంధనలు ఎక్కడా మీరకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో, 4 కెమెరాలతో గోవా, మంగళూరు మరియు ఉడుపిలో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. వీలైనంత త్వరగా ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, అనుకున్న దానికంటే త్వరగానే కాకుండా అద్భుతంగా చిత్రం పూర్తయిందని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పట్టుదల, క్రమశిక్షణతో పని చేసిన నా టీంకి చాలా థాంక్స్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కి ఈ చిత్రంతో మళ్ళీ పూర్వ వైభవం రానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతే కాక మా అబ్బాయిని ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆకట్టుకునే సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్ తో హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది మా '7 డేస్ 6 నైట్స్' కథ" అని అన్నారు. ఇక ఈ సినిమా నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ నా కెరీర్ లోనే ఇది బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందని అన్నారు. నిర్మాణం అయినా దర్శకత్వం అయినా ఎంతో పట్టుదలతో అంతే ఇష్టంగా నిర్వర్తిస్తారన్న ఆయన మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో వచ్చిన ఎన్నో క్లాసిక్ హిట్స్ మధ్య ఈ చిత్రం కూడా చేరనుందని అన్నారు.
ఇక మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకంపై సుమంత్ ఎం. అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ కూడ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములు. ఇక సుమంత్ అశ్విన్ సరసన మెహర్ చావల్ అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్న ఈ సినిమాలో రోహన్, కృతికా శెట్టి మరో జంటగా పరిచయమవుతున్నారు. ఈ నలుగురు కాకుండా సుష్మ, రిషికా బాలి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











