బాహుబలికి అరుదైన గౌరవం.. ఆతృతగా ఉందంటూ రాజమౌళి సందేశం
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించారు. ఓ తెలుగు సినిమా సత్తా ఎలా ఉంటుందనేది ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది బాహుబలి సినిమా. అందుకే చిత్రసీమలో ఎప్పటికీ బాహుబలికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
గత బాక్సాఫీస్ రికార్డులకు చెరిపేస్తూ సరికొత్త రికార్డులకు తెరలేపింది బాహుబలి సినిమా. ఇక ఈ సినిమా సృష్టించిన కలెక్షన్ల సునామీ తెలుగు సినీ చరిత్రలో ఏ సినిమా కూడా సృష్టించలేక పోయింది. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా ఇది. బాహుబలి సిరీస్ నుంచి విడుదలైన రెండు భాగాలు వేటికవి ప్రత్యేకమైన రికార్డులు నెలకొల్పి ఔరా అనిపించాయి.

బాహుబలి సిరీస్ లో మొదటి భాగమైన 'బాహుబలి ది బిగినింగ్' సినిమా జపాన్, చైనా వంటి దేశాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమైంది. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ వేయడం విశేషం. ఈ బాటలోనే బాహుబలి సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని సుప్రసిద్ధ రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా టీమ్.. బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను లైవ్ ఆర్కెస్ట్రాతో వినిపించనున్నారు.
ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. అక్టోబరు 19న బాహుబలి ద బిగినింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను రాయల్ ఆల్బర్ట్ హాల్లో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా సభ్యులు లైవ్ ప్రదర్శన ఇస్తున్నారని, ఈ ప్రదర్శన కోసం చాలా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నామని రాజమౌళి పేర్కొన్నాడు. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో లైవ్ లో ఇంగ్లీషేతర సినిమాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెర్ఫామ్ చేయనుండడం ఇదే మొదటిసారి. ఈ అరుదైన అవకాశం దక్కడం పట్ల బాహుబలి టీమ్ సంతోషం వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications











