‘ఆకాశవాణి’ పర్ఫెక్టుగా ఫినిష్ చేసిన కార్తికేయ.. అంతా రాజమౌళి ట్రైనింగేనా?
బాహుబలి డైరెక్టర్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ 'షోయింగ్ బిజినెస్' పేరుతో సొంత బేనర్ స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బేనర్లో తెరకెక్కుతున్న తొలి చిత్రం 'ఆకాశవాణి'. అశ్విన్ గంగరాజు అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.
కార్తికేయ కొన్నేళ్లుగా తన తండ్రితో ఉంటూ సినిమా ప్రొడక్షన్ మీద మంచి పట్టు సాధించారు. అలా తండ్రి వద్ద పని చేయడం వల్ల సంపాదించిన అనుభవంతో 'ఆకాశవాణి' చిత్రాన్ని పక్కా ప్లానింగుతో ముందుగా అనుకున్న ప్రకారం 50 రోజుల్లో పూర్తి చేశారు.

షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు అశ్విన్ గంగరాజు ట్వీట్ చేశారు. 50 రోజుల లాంగ్ షెడ్యూల్ ముగిసింది. ఇంటికి దూరంగా ఉంటూ చాలా కష్టపడ్డాం. ఎన్నో ఛాలెజింగ్ లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ఇదొక అడ్వంచరస్ రైడ్‌లా అనిపించింది. ఇప్పుడు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.
ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన గురించి దర్శకుడు వ్యాఖ్యానిస్తూ ''ఆయన అద్భుతమైన నటుడు, చాలా నిజాయితీగల వ్యక్తిత్వం. ఆయనతో పని చేసిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన నాకు మంచి స్నేహితుడు మాత్రమే కాదు.. కుటుంబ సభ్యుడిలా, గురువులా వ్యవహరించారు'' అని తెలిపారు.
'ఆకాశవాణి' సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా. సినిమాలో సముద్రఖని తప్ప అందరూ కొత్తనటీనటులే. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రానికి సౌండ్ డిజైన్: రఘునాథ్.కె, కాస్ట్యూమ్స్: సంజనా శ్రీనివాస్, కాస్టింగ్ డైరెక్టర్: మహతి బిక్షు, ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ నాథ్, ఎస్.బింగి, లైన్ ప్రొడ్యూసర్: శశాంక్, స్క్రీన్ ప్లే: అశ్విన్ గంగరాజు, సందీప్ రాజ్, సాయికుమార్ రెడ్డి, నిర్మాత: ఎస్.ఎస్.కార్తికేయ, దర్శకత్వం: అశ్విన్ గంగరాజు.


Click it and Unblock the Notifications











