AP Exit Polls 2024: ఆరా మస్తాన్ సర్వే పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ఆ కక్షతోనే అంటూ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మునుపెన్నడూ లేనివిధంగా హోరాహోరీగా జరిగాయి. ఓటర్లు సైతం అర్ధరాత్రి వరకు క్యూలైన్‌లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరిని పలకరించినా కసిగా ఓటేసినట్లుగా చెప్పారు. భారీ పోలింగ్ ఎవరి కొంప ముంచుతుందోనని అభ్యర్ధులు, పార్టీలు టెన్షన్‌తో ఉన్నాయి. ఫలితాలు రాకపోయినప్పటికి దానికి దగ్గరగా ఉండే ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. అందుకు తగినట్లుగానే శనివారం సాయంత్రం లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు, జాతీయ మీడియా నిర్వహించిన ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ రూపంలో విడుదల చేశాయి.
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే మూడోసారి అధికారాన్ని అందుకోబోతోందని దాదాపు అన్ని సర్వేలు స్పష్టంగా తెలియజేశాయి. ఎన్డీయే 350 నుంచి 370 సీట్లు లభిస్తే.. ఇండియా కూటమి 200 లోపు స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేశాయి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే కొన్ని ఎన్డీయే కూటమికి గెలుస్తుందని చెబితే.. మరికొన్ని మాత్రం వైసీపీ గెలుస్తుందని పేర్కొన్నాయి. అయితే తెలుగునేలకి చెందిన ఆరా సంస్థ వెలువరించిన అంచనాలు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచి మరోసారి అధికారంలోకి రాబోతోందని ఆరా మస్తాన్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని.. ఎన్డీయేకు 71 నుంచి 81 సీట్లు వస్తాయని మస్తాన్ చెప్పారు. అలాగే ఎన్డీయేకు 47.55 శాతం.. వైసీపీకి 49.40 శాతం, ఇతరులకు 3.04 శాతం ఓట్లు రావొచ్చని మస్తాన్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకి 10 నుంచి 12 సీట్లు.. వైసీపీకి 13 నుంచి 15 సీట్లు వస్తాయని ఆరా మస్తాన్ అంచనా వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 47.68 శాతం.. వైసీపీకి 48.29 శాతం, ఇతరులకు 4.03 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు.
ఎగ్జిట్ ఫలితాల్లో ఏడు ప్రధాన సర్వేలను పరిశీలిస్తే అందులో ఆరింట్లో ఎన్డీయే కూటమే ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అన్ని సర్వేలు ఎన్డీయే కూటమికి 100కు పైగా సీట్లు వస్తాయని తెలిపాయి. కానీ ఆరా సంస్థ అందుకు భిన్నమైన అంచనాలను వెలువరించడం తెలుగునాట ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే ఆరా మస్తాన్ కూటమికి వ్యతిరేకంగా తన సర్వే ఫలితాలను ప్రకటిస్తారని ఏపీ ఎన్నికల పోలింగ్ జరగడానికి ముందే చెప్పారు హీరో శివాజీ.
'' ఇప్పుడే ఒక వార్త విన్నాను. ఒక సర్వే సంస్థకు సంబంధించిన మహానుభావుడు ఈరోజు సాయంత్రం కూటమికి వ్యతిరేకంగా , టికెట్ అడిగితే ఇవ్వలేదనే కక్షతో ఓ సర్వే వదలబోతున్నాడు. నువ్వు 100 సర్వేలు చేసినా సోదరా .. ప్రజల సర్వే ముందు మీరంతా దేనికి పనికిరారు. కూటమి అభ్యర్ధులు ఘనవిజయం సాధించబోతున్నారు. క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఫీలవుతున్నావు.. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోతావు '' అంటూ శివాజీ వ్యాఖ్యానించారు.
కానీ అదే రోజు ఈ ప్రచారంపై ఆరా మస్తాన్ స్పందించారు. తాము పోలింగ్‌కు ముందు ఎలాంటి సర్వే విడుదల చేయడం లేదని , పోలింగ్ ముగిసిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పుడే పరోక్షంగా వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లుగా ఆయన సంకేతాలిచ్చారు. ఏపీలో కులాలన్నీ వర్గాలుగా విడిపోయాయని.. రాష్ట్రంలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజికవర్గ నినాదం అందుకుందని, దాని వల్ల ఆయా వర్గాల్లో ఆ పార్టీపై సానుకూల స్పందన ఉందని మస్తాన్ చెప్పారు.
కట్ చేస్తే నిన్న ఆరా సంస్థ విడుదల చేసిన సర్వే అంచనాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉండటం చర్చనీయాంశమైంది. నిజంగానే కూటమి నుంచి టికెట్ దక్కలేదన్న కక్షతోనే మస్తాన్ ఇలాంటి సర్వే వదిలారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి ఈ వ్యవహారంపై శివాజీ మరోసారి స్పందిస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











