Acharya Censor Report: మెగా మూవీకి ఆ సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతంటే!
పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా నలభై ఏళ్లకు పైగానే తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అప్పట్లో బడా హీరోలతో పోటీ పడి మరీ స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లిపోయారు. ఈ క్రమంలోనే రాజకీయాల కోసం చాలా కాలం పాటు సినిమాలకు బ్రేకిచ్చిన చిరంజీవి.. 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ దూసుకుపోతోన్నారు.
రీఎంట్రీలో ఇప్పటికే పలు చిత్రాలను చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా 'ఆచార్య' అనే సినిమాలో నటించారు. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన సంగతి తెలిసిందే. దేవాదాయ భూముల ఆక్రమణలపై నక్సలైట్లు చేసే ఉద్యమం నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. అయితే, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ల కారణంగా ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల పాటు వాయిదా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో టాకీ పార్టు కంప్లీట్ చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేసేసి విడుదలకు సిద్ధం చేశారు.

మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన 'ఆచార్య' మూవీని ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు నమోదు కావడంతో పాటు సోషల్ మీడియాలో ఇవన్నీ తెగ ట్రెండ్ అయిపోయాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక, ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సైతం ఎంతగానో ఆకట్టుకుంది. అదే సమయంలో పలు రికార్డులు కూడా నమోదు చేసింది. దీంతో ఈ చిత్రం మరింత మందికి చేరువ అయింది.
క్రేజీ కాంబోలో రూపొందిన 'ఆచార్య' మూవీ ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేసింది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఎన్నో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. ఇక, తాజాగా ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది. అంతేకాదు, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఇక, ఈ సినిమా 2 గంటల 46 నిమిషాల 31 సెకెన్ల నిడివితో రాబోతుందని కూడా ఓ న్యూస్ ప్రస్తుతం ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
'ఆచార్య' మూవీ కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే సందేశాత్మకంగా సాగే చిత్రమని తెలుస్తోంది. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











