ఎక్కువ మాట్లాడితే రీల్స్ కట్ చేస్తాం .. 10 నిమిషాలు డ్యూటీ పక్కనబెడితే , అల్లు అర్జున్‌కు ఏసీపీ వార్నింగ్
గడిచిన 15 రోజులుగా కొందరు వ్యక్తులు పోలీసులపై బండలు వేస్తున్నారని మండిపడ్డారు ఏసీపీ విష్ణుమూర్తి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ఆయన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజలకు రక్షణగా ఉన్న పోలీస్ అధికారులపై అవాకులు చెవాకులు పేలుతున్నారని, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం ధనమదంతో ఉన్న కొందరు బడా బాబులు ప్రయత్నిస్తున్నారని విష్ణుమూర్తి మండిపడ్డారు.
ఇన్వెస్టిగేషన్‌ను సైతం ప్రభావితం చేసే విధంగా కొందరు వ్యక్తులు కోర్టుల ముందు ముద్దాయిల్లా చేతులు కట్టుకున్నవారు కూడా ప్రెస్‌మీట్‌లు పెట్టి మరి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏసీపీ ఫైర్ అయ్యారు. నిన్న ఒక ఫిల్మ్ యాక్టర్ కూడా జడ్జిగారిలా ఇది ప్రమాదవశాత్తూ జరిగిందే తప్పించి, ఎవరిది తప్పు లేదని చెబుతున్నాడని విష్ణుమూర్తి మండిపడ్డారు. ఇలాంటి వాటిని ప్రసార మాధ్యమాలు ముందు వెనుక ఆలోచించకుండా ప్రసారం చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయన్నారు.

అలాంటి వ్యక్తులు తాము చేసే పనులు రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి ఉందా లేదా అన్నది తెలుసుకోవాలని ఏసీపీ సూచించారు. అల్లు అర్జునేమీ పాలు తాగే పిల్లాడు కాదని.. 40 ఏళ్లు పైబడిన వ్యక్తని, పైగా సెలబ్రెటీ అని అలాంటి వ్యక్తి ఎంత హుందా ప్రవర్తించాలని విష్ణుమూర్తి ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షా 30 వేల పోలీస్ కుటుంబాలు ఉన్నాయని.. ఒక ఈవెంట్‌కు బందోబస్త్ నిర్వహించాలంటే దాదాపు వారం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటామని ఆయన వెల్లడించారు. నాకు అత్యవసరం ఉంది కాబట్టి.. నాకు బందోబస్తు కల్పించమంటే అప్పటికప్పుడు సాధ్యం కాదని ఏసీపీ తెలిపారు.
మేం కాగితం ఇచ్చేశాం.. పర్మిషన్ వచ్చిందా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెట్టి మీరేం చేస్తారో తెలియదు నా పని అయిపోవాలి అన్నట్లుగా వ్యవహరించడం సరికాదని విష్ణుమూర్తి పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు పోలీస్ అధికారులను బండ బూతులు తిడుతున్నారని.. కానీ తాము ఓపిక పడుతున్నామని , ఒక్క 10 నిమిషాలు మేం డ్యూటీ పక్కనపెట్టేస్తే మీ బతుకులు ఏమవుతాయో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. అందరూ పండుగలు చేసుకుంటుంటే పోలీసులు రోడ్ల మీద ఉంటారని వాళ్లు సమాజం కోసమే పనిచేస్తారని మేం కూడా మనుషులమేనని ఏసీపీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ హీరో మాటి మాటికి ప్రెస్‌మీట్లు పెట్టి సమాజాన్ని గందరగోళ పరుస్తున్నాడని , అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టొచ్చా అని విష్ణుమూర్తి ప్రశ్నించారు. ముద్దాయిగా ఉన్న వ్యక్తి నేను కొంత మొత్తం బాధితుడికి ఇస్తున్నానని చెప్పకూడదని అది లంచం కిందకి వస్తుందని ఏసీపీ తెలిపారు. ఈ విషయాలను కోర్ట్ దృష్టికి తీసుకెళ్లి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయించాల్సిన అవసరం ఉందని విష్ణుమూర్తి అభిప్రాయపడ్డారు.
అల్లు అర్జున్ బాధ్యతగల పౌరుడిగా ప్రవర్తించలేదని.. నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఓ 50 మంది మనుషుల్ని తీసుకెళ్లి దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదని బౌన్సర్ల గురించి ఏసీపీ ఫైర్ అయ్యారు. బౌన్సర్లను పెట్టుకునేందుకు పర్మిషన్ ఉందా? వాళ్ల వల్లే అక్కడ తొక్కిసలాట జరిగిందన్నారు. నీకంటే వీరులు శూరులు వచ్చారు వెళ్లారు కాలగర్భంలో కలిసిపోయారని .. సినిమాల్లో డైలాగులు చెప్పి అది లేదు, ఇది లేదు అంటే నీ రీల్స్ అన్ని కట్ చేస్తామని ఏసీపీ హెచ్చరించారు. ఒక్క పోలీసును కూడా నీకు భద్రత కల్పించొద్దని చెబితే నువ్వు పబ్లిక్‌లో తిరగగలుగుతావా అని ఆయన ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











