ఆమెలా బతకలేం.. బిలియనీర్లకైనా కష్టమే , హీరోయిన్‌పై నటుడి షాకింగ్ కామెంట్స్
హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ. మహా అయితే మూడు నాలుగేళ్లు , కాస్తో కూస్తో హిట్లు ఇస్తే మరో రెండేళ్లు పొడిగింపు. ఈ కాస్త సమయంలోనే తన జీవితానికి కావాల్సినంత సంపాదించుకోవాలి. కానీ అది కూడా ఏ కొందరికో సాధ్యం తప్పించి అందరకీ కాదు. హీరోయిన్ల పరిస్ధితే ఇలా ఉంటే మహిళా నటుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది ఓ డ్యాన్సర్ అయితే .. కానీ హీరోలను మించిన స్టార్ డమ్ సంపాదించి దేశాన్నే ఊపేశారు సిల్క్ స్మిత.
ఇప్పుడంటే ఐటెం సాంగ్స్‌ను స్టార్ హీరోయిన్లు చేసేస్తున్నారు కానీ ఒకప్పుడు ఈ కేటగిరికీ సెపరేట్ భామలు ఉండేవారు. జయమాలిని, జ్యోతిలక్ష్మీ, అనూరాధ వంటి వారు ఐటెం సాంగ్స్‌తో ఒక ఊపు ఊపారు . ఈ కోవలోకే వస్తారు సిల్క్ స్మిత. ఇండస్ట్రీలో ఉన్నది తక్కువ సమయమే అయినా భారతీయ సినిమా బతికున్నంత వరకు ఆమె పేరు నిలిచే ఉంటుంది. మత్తెక్కించే కళ్లు, అందమైన రూపంతో సిల్క్ స్మిత నాటి యువతరాన్ని కట్టి పడేశారు. కేవలం ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే వారంటే అతిశయోక్తి కాదు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మీ. చిన్న వయసులోనే వివాహం కావడంతో అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఇల్లు వదిలి పారిపోయిన ఆమె మద్రాస్‌లో ..టచ్ అప్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. సినిమాలలో చిన్నా చితకా రోల్స్ చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్న దశలో ఆమెకు మలయాళ దర్శకుడు ఆంటోనీ తన సినిమాలో అవకాశం కల్పించడంతో పాటు తన పేరును సిల్క్ స్మితగా మార్చారు. ఈ క్రమంలో అగ్రనటుల చిత్రాలలో వ్యాంప్ రోల్స్ , క్లబ్ డ్యాన్సర్ పాత్రలు రావడం మొదలై యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించారు సిల్క్ స్మిత.
1980 నుంచి 1995 మధ్యకాలంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 400కు పైగా చిత్రాలలో నటించారు. ఈ సమయంలో ఆమె లేని సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. కోట్లాది రూపాయల ఆస్తులు, పేరు ప్రతిష్టలు, డబ్బుతో సిల్క్ స్మిత సంపన్నురాలిగా మారిపోయారు. కానీ ప్రేమలో విఫలం, సినిమా నిర్మాణంతో ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టడంతో 1996 సెప్టెంబర్ 23న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు సిల్క్.

ఆమె జీవితం, మంచి మనసుపై పలువురు సినీ ప్రముఖులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చేవారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత మిత్రుల్లో ఒకరైన సీనియర్ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ఆమె జీవితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సిల్క్ స్మిత సెట్‌లో నల్ల కళ్లజోడు పెట్టుకుని , కాలు మీద కాలు వేసుకుని కూర్చునేదని.. హీరోలు వచ్చినా పట్టించుకునేది కాదని చెప్పారు. ఎందుకు బాస్ అలా చేస్తున్నావని నేను అడిగితే.. ఈ మగళ్లంతా నన్ను ఎలా చూస్తున్నారో గమనిస్తున్నానని చెప్పేదని బాబూమోహన్ గుర్తుచేసుకున్నారు.
ఓ రోజున చెన్నైలో షూటింగ్‌లో ఉండగా.. బాస్ అని నన్ను పిలిచి షూటింగ్ అయ్యాక నా చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లిందని ఆయన తెలిపారు. ఇంద్ర భవనం లాంటి ఆమె ఇంటిని చూడగానే నాకు షాక్ తగిలిందని, వేల కోట్లు ఉన్నవారికి కూడా అలా బతకడం కష్టమని అనిపించిందని బాబూమోహన్ చెప్పారు. తన సినిమాలోని కాస్ట్యూమ్స్‌ని సిల్క్ ఎంతో అపురూపంగా దాచుకునేదని వెల్లడించారు. కానీ చిన్న వయసులోనే సిల్క్ స్మిత కన్నుమూయడం తనను ఇప్పటికీ బాధిస్తూనే ఉంటుందని బాబూమోహన్ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











