చిరంజీవి భేటీకి ముందు.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మంచు మనోజ్
టాలీవుడ్‌లో టికెట్ల రేట్లు, థియేటర్ యాజమాన్యాలకు రాయితీలు, అలాగే మా ఎన్నికల అంశాలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యల గురించి చర్చించేందుకు సినీ వర్గాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మెగాస్టార్ చిరంజీవితో పలువురు అగ్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో వివాదాలు రచ్చ కెక్కాయి. ఈ ఎన్నికల్లో తమ అధిపత్యాన్ని నిరూపించుకొనేందుకు మంచు విష్ణు, మోహన్ బాబు ఫ్యామిలీ విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మంచు నట వారసుడు మంచు మనోజ్ కలవడం చర్చనీయాంశమైంది. తాజాగా వైఎస్ జగన్‌తో దిగిన ఫోటోను మనోజ్ షేర్ చేయగా వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద చర్చకు దారి తీసింది.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంచు మనోజ్ కలిసిన తర్వాత ట్వీట్ చేస్తూ.. విజన్ ఉన్న నేత, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలువడం గొప్ప గౌరవంగా మారింది. భవిష్యత్‌లో ఏపీ కోసం ఆయన తీసుకొనే చర్యలు, ప్లాన్స్ విన్న తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. మీ విజన్ కార్యరూపం దాల్చడానికి మీకు ఆ దేవుడు శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకొంటున్నాను. మంచి పాలన అందిస్తున్న మీకు బెస్ట్ విషెస్ అంటూ మంచు మనోజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే ఏపీ సీఎంను ఎందుకు కలిశాననే విషయాన్ని మాత్రం వెల్లడించకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మా ఎన్నికల కోసం కలిశారా? లేక తమ కుటుంబంతో ఉన్న అనుబంధం రీత్యా కలిశారా? ఇంకా ఏదైనా వ్యక్తిగత విషయంపై భేటీ అయ్యారా అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











