ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ
ప్రముఖ నటుడు శరత్ బాబు ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి వార్త వినగానే సినీ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు, అభిమానుల సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం, వ్యక్తిగత జీవితం వివరాల్లోకి వెళితే..
శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. ఆయన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 1951 జూలై 31న జన్మించారు. ఆయన ప్రముఖ నటి రమాప్రభను వివాహం చేసుకొన్నారు. దాదాపు 14 ఏళ్లు దాంపత్య జీవితాన్ని కొనసాగించిన వారు.. ఆ తర్వాత వ్యక్తిగత విభేదాలతో విడిపోయారు. అనంతరం స్నేహ అనే యువతిని వివాహం చేసుకొన్నారు. అయితే స్నేహతో వైవాహిక జీవితం ఎక్కువ రోజులు కొనసాగలేదు. 2011లో స్నేహా నుంచి విడాకులు తీసుకొన్నారు.

శరత్ బాబు గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు అవయవాల వైఫల్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆయన సోమవారం ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్నుమూశారు.
శరత్ బాబు ఇటీవల పవన్ కల్యాన్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఆయన నటించిన మళ్లీ పెళ్లి సినిమా విడుదల కావాల్సి ఉంది. వీకే నరేష్, పవిత్రా లోకేష్ నటించిన ఈ సినిమా ఆయనకు చివరి సినిమా. ఈ చిత్రం మే 26వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు.
శరత్ బాబు 250 చిత్రాల్లో నటించారు. 1973లో రామరాజ్యం అనే చిత్రంతో ఆయన సినీ కెరీర్ ప్రారంభించారు. తెలుగు, తమిళం,మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించారు. 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు నంది అవార్డు అందుకొన్నారు. సీతాకోకచిలుక, సాగర సంగమం, అభినందన, సితార, అన్వేషణ, సంసారం ఒక చదరంగం, ఆపద్బాందవుడు, ముత్తు, హలో బ్రదర్,స్వాతి ముత్యం, దాగుడు మూతలు, సిసిందీ లాంటి చిత్రాలు ఆయన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చాయి.


Click it and Unblock the Notifications











