చేజేతులా 1800 కోట్లు పోగొట్టుకున్నా.. టాలీవుడ్ హీరో ఎమోషనల్..
నటుడు శివాజీ (Actor Sivaji) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం, తర్వాత హీరోగా ఎదిగి దాదాపు 90కు పైగా సినిమాల్లో నటించిన స్థాయికి చేరుకుంది. తన సహజ నటనతో, పక్కింటి అబ్బాయి ఇమేజ్‌తో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కొంత వివాదాలు చుట్టుముట్టడంతో ఆయన కెరీర్‌కు బ్రేక్ పడింది. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న శివాజీ.. సెకండ్ ఇన్నింగ్స్‌ను బిగ్ బాస్ ద్వారా ప్రారంభించారు. అయితే.. తాజాగా శివాజీ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ 18 కోట్ల అవకాశాన్ని కోల్పోయానని షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే?
హీరో శివాజీకి బిగ్ బాస్ (Bigg Boss) ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన 90's వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించారు. ఆ సిరీస్‌లో మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో కనిపించిన శివాజీ, భావోద్వేగాల్ని ఎంతో సహజంగా వ్యక్తపరచి ప్రేక్షకులను కదిలించారు. ముఖ్యంగా కుటుంబ నేపథ్య కథలో ఆయన నటన మరోసారి ఆయన ప్రతిభను గుర్తుచేసింది. ఆ తరువాత దండోరా, కోర్టు వంటి సినిమాతో భారీ విజయాలను అందుకున్నారు. ఇప్పుడు 'సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లయ-శివాజీ జోడీ చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించబోతుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

'సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని' (SSS Film) ప్రమోషన్ కార్యక్రమాల్లో ఓ ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ.. తన కెరీర్ గ్యాప్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆర్థిక విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా అవకాశాలు లేనప్పుడు జీవనాధారంగా రియల్ ఎస్టేట్ చేసాను. ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనడం, అమ్మడం చేస్తూ జీవితం ముందుకు నడిపించాను. అందులో బాగా సంపాదించానని చెప్పలేను. అదే సమయంలో ఏమీ లేదు అనడం కూడా సరికాదు. ఉన్నదాంట్లో సంతోషంగా జీవించాను' అని ఆయన తెలిపారు.
శివాజీ రియల్ ఎస్టేట్ ద్వారా భారీగా సంపాదించారని ఉన్న టాక్ గురించి ప్రశ్నించగా, ఆయన స్పష్టత ఇచ్చారు. 'అది పూర్తిగా నిజం కాదు. పోగు చేయడానికి కాదు... జీవనాధారంగా చేశాను. కొనడం, అమ్మడం వ్యాపారం కదా' అని అన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అమ్మిన భూములు ఇప్పుడు కోట్లలో ఉండటం తనను ఆలోచింపజేస్తుందని వెల్లడించారు. ఉదాహరణగా యాదగిరిగుట్ట ప్రాంతాన్ని ప్రస్తావించారు. 'నేను కొనుగోలు చేసినప్పుడు ఎకరం కేవలం 70 వేల రూపాయలు. తర్వాత ఎకరానికి 9 లక్షలకు అమ్మాను. ఆ సమయంలో అది పెద్ద లాభమే. కానీ ఇప్పుడు అక్కడ ఎకరం కోట్లలో ఉంది. అప్పుడే ఉంచుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది' అని చెప్పారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ భూములు... చేజారిన కోట్లు?
ఇక హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో (కోకాపేట్, నానక్ రామ్ గూడ) తనకు ఉన్న భూముల గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'ఆ ప్రాంతంలో సుమారు 18 ఎకరాలు కొనుగోలు చేసి తర్వాత అమ్మివేశాను. కనీసం ఒక ఎకరం అయినా ఉంచుకుని ఉండాల్సింది. ఇప్పుడు అక్కడ ఎకరం 100 కోట్ల వరకు వెళ్లింది. అలా చూస్తే దాదాపు 18 కోట్ల అవకాశాన్ని కోల్పోయినట్టే. కానీ అప్పట్లో ఇంత మార్కెట్ పెరుగుతుందని ఊహించలేదు' అని చెప్పారు. అయితే తాను రియల్ ఎస్టేట్‌లో రొటేషన్ పద్ధతిలోనే ముందుకు వెళ్లానని, అప్పటి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలే అవని వివరించారు.
డబ్బు గురించి ప్రశ్నించగా, 'పోగు చేసుకోవడం లక్ష్యం కాదు. జీవితం సంతోషంగా గడవాలి. ఉన్నదాంట్లో సంతృప్తి ఉంటే చాలు' అని శివాజీ చెప్పారు.సెకండ్ ఇన్నింగ్స్‌లో నటుడిగా మళ్లీ బిజీ అయిన ఆయన, ఇప్పుడు కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టినట్టు తెలిపారు. మొత్తానికి శివాజీ చేసిన ఈ కామెంట్స్ చర్చనీయంగా మారాయి.


Click it and Unblock the Notifications











