‘బ్రహ్మానందంతో డబ్బుల గొడవ.. పరిటాల రవి ఎంట్రీ.. శ్రీహరి నాకు ఫోన్ చేసి..’
చిత్ర సీమలో నవరసాలను అద్భుతంగా పలికించి, అన్ని రకాల వేషాలను వేయగలిగిన వారు అరుదనే చెప్పొచ్చు. అలా ఆల్‌రౌండర్ అనిపించుకున్న నటుల్లో శివాజీ రాజా ఒకరు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్ర పోషించినా పరకాయ ప్రవేశం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో శివాజీ రాజా వందిలాది చిత్రాల్లో నటించారు. చదువుకునే రోజుల్లోనే హీరోలను, ఇతర నటులను అనుకరిస్తూ అందరినీ నవ్వించేవారట శివాజీ రాజా. అలా పలువురి ప్రోత్సాహంతో , సినిమాల మీద పిచ్చితో మద్రాస్ రైలెక్కారు . అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు, పస్తులూ ఉన్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన సీతారామకళ్యాణంలో చిన్న పాత్ర పోషించిన శివాజీరాజాకు కళ్లు చిత్రం బ్రేక్ ఇచ్చింది. దీంతో అవకాశాలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టాయి. అహో బ్రహ్మ.. ఓహో శిష్యాతో హీరోగానూ నటించిన ఆయన అనంతరం తన కామెడీ టైమింగ్, డైలాగ్ డిక్షన్‌తో కడుపుబ్బా నవ్వించారు. మధ్యలో హీరో ఫ్రెండ్‌గా, అన్నగా, తమ్ముడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అలరించారు. అవకాశాలు తగ్గుతున్న దశలో జెమినీ టీవీలో ప్రసారమైన అమృతం సీరియల్స్ శివాజీ రాజాను మరోసారి నిలబెట్టింది.

అప్పట్లో వినోదం కోసం జనం టీవీలనే ఆశ్రయించడంతో ఆదివారం కోసం ఎదురుచూశారు. ఆ రోజున సాయంకాలం అమృతం సీరియల్ కోసం కుటుంబమంతా ఓ చోట చేరేవారు. ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు అంటూ ఆ సీరియల్ ఒక తరాన్ని నవ్వించింది. ఆంజనేయులు, అమృతరావు, అప్పాజీ, సర్వం వంటి క్యారెక్టర్లు ప్రేక్షకులను నవ్వించాయి. వెకిలితనం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా హాయిగా నవ్వుకోవచ్చు. అమృతంగా శివాజీ రాజా నటన అందరి మనసులో బలంగా పడింది.
స్వతహాగా దూకుడు, మొండితనం శివాజీలో ఎక్కువ. ఎదుటి వారికి, నా అన్న వారికి కష్టమొస్తే ఆయన తట్టుకోలేడు.. అందుకోసం అవతలి వ్యక్తి ఎంతటివాడైనా సరే ఢీకొడతాడు. ఇది ఆయనకు ప్లస్.. ఇదే ఆయనకు మైనస్ అని సన్నిహితులు చెబుతుంటారు. అందరి కోసం పాటుపడే తత్వమే శివాజీ రాజాను మా అధ్యక్షుడిని చేసిందని అంటారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన సినీ కార్మికుల సంక్షేమానికి కృషి చేశారు. కరోనా సమయంలో ఎంతో మందికి నిత్యావసర సరకులు, ఆర్ధిక సాయం చేశారు. వ్యవసాయాన్ని ఇష్టపడే శివాజీరాజా తనకు మణికొండలో ఉన్న ఇంట్లో, మొయినాబాద్‌లోని పొలంలో మొక్కలు పెంచుతూ గడుపుతున్నారు. కొడుకు విజయ్ రాజాని ఇండస్ట్రీకి పరిచయం చేసి హీరోగా నిలదొక్కుకునేందుకు తోడ్పాటును అందిస్తున్నారు. ఇటీవల అనారోగ్య కారణాలతో సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు శివాజీ.

స్వతహాగా స్నేహానికి ప్రాణమిచ్చే శివాజీ ఇండస్ట్రీలో అందరితో చాలా కలివిడిగా ఉంటారు అలాంటిది ఏకంగా కామెడీ కింగ్ బ్రహ్మానందంతోనే ఆయన గొడవ పడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా శివాజీరాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తనికెళ్ల భరణి , మల్లిఖార్జునరావుతో ఇలా కొంతమంది హాస్యనటులతో కలిసి బ్రహ్మానందం ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశానని.. అయితే దీనికి సంబంధించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తుచేశారు. దీంతో తాను బ్రహ్మానందాన్ని నిలదీయగా.. పెద్ద గొడవ జరిగి విషయం మోహన్ బాబు, పరిటాల రవిల వరకు వెళ్లిందని శివాజీ రాజా చెప్పారు.
ఈ గొడవపై మాట్లాడాలని ఓ రోజున మోహన్ బాబు ఫోన్ చేసి పిలిపించారని, కానీ అక్కడ పరిస్ధితి సీరియస్‌గా ఉందని నటుడు శ్రీహరి తనకు ఫోన్ చేసి చెప్పాడని శివాజీరాజా అన్నారు. తాను వెళ్లగానే మోహన్ బాబు .. కాఫీ తాగమని చెప్పారని తాగిన తర్వాత గొడవ గురించి అడిగారని తెలిపారు. మధ్యలో పరిటాల రవి మాట్లాడుతూ.. ఎందుకమ్మా గొడవలు, కామ్‌గా ఉండాలని సూచించారని .. బ్రహ్మానందంతో మొత్తం సెటిల్ చేసుకున్నానని గొడవలు లేవని చెప్పడంతో మోహన్ బాబు మెచ్చుకుని అక్కడి నుంచి పంపేశారని శివాజీ రాజా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











