‘‘ 100 కోట్లు ఇచ్చినా చేయను .. కొడుకు కోసం ఆ డైరెక్టర్ బలవంతం చేశాడు ’’
90లలో టాలీవుడ్, బాలీవుడ్‌లను ఒక ఊపారు అమీషా పటేల్. ఆమె నటించిన సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. 50కి చేరువ అవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో మెరిసిపోతున్న అమీషా పటేల్ హిందీ నాట మోస్ట్ వాంటెడ్ నటిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమీషాపై ఓ దర్శకుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
9 జూన్ 1975న ముంబైలో పుట్టి పెరిగారు అమీషా పటేల్. తల్లిదండ్రులు అమిత్ పటేల్, ఆశ. ఈమెకు అష్మిత్ పటేల్ అనే సోదరుడు ఉన్నాడు. ఐదేళ్ల వయసులోనే భరత నాట్యంలో ప్రావీణ్యత సంపాదించిన అమీషా.. ముంబైలో ప్రాథమిక విద్యను అభ్యసించగా అమెరికా బయో జెనెటిక్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన అమీషా.. ఎకనమిక్ అనలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రఖ్యాత ఆర్ధిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ నుంచి ఆఫర్ వచ్చినా ఆమె తిరస్కరించారు.

2000వ సంవత్సరంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన కహో నా ప్యార్ హై సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు అమీషా. తర్వాత పవన్ కళ్యాణ్ - పూరీ జగన్నాథ్‌ల బద్రీతో తెలుగు వారిని పలకరించారు ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచినా తన ఫోకస్ మాత్రం బాలీవుడ్‌పైనే పెట్టారు అమీషా. నాలుగేళ్ల తర్వాత మహేశ్‌తో కలిసి నానిలో నటించిన ఆమె.. ఎన్టీఆర్‌తో నరసింహుడు, బాలయ్యతో పరమ వీర సింహ సినిమాలో తళుక్కున మెరిశారు. కానీ ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆమె టాలీవుడ్‌కు దూరమయ్యారు.
బాలీవుడ్‌లోనూ ఆమె కెరీర్ పడుతూ లేస్తూ సాగింది.. కొత్త అందాల రాకతో పాటు వయసు పెరుగుతుండటంతో అమీషా పటేల్ హవా తగ్గింది. ఇలాంటి దశలో గతేడాది సన్నిడియోల్ హీరోగా అనిల్ శర్మ తెరకెక్కించిన గదర్ 2 బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే గదర్ 2 చిత్ర దర్శకుడు అనిల్ శర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమీషాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అత్త పాత్రలో నటించడానికి అమీషా అంగీకరించలేదని .. ఆమె కంటే గొప్ప నటీనటులు చిన్న వయసులోనే చేశారని అనిల్ శర్మ కామెంట్ చేశారు.
దీనిపై స్పందించిన అమీషా పటేల్ తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఇది కేవలం సినిమా మాత్రమేనని.. ఏం చేయాలనేది నా ఇష్టమని .. 100 కోట్లు ఇచ్చినా అత్త లాంటి పాత్రలు చేయనని ఆమె తేల్చిచెప్పారు. అయితే అనిల్ శర్మపై గతంలోనూ అమీషా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు చెప్పినట్లు కాకుండా గదర్ 2 క్లైమాక్స్‌ను మార్చేశారని.. తన కుమారుడు ఉత్కర్ష్ శర్మ కోసమే అనిల్ ఆయన ఆ విధంగా చేశాడని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.


Click it and Unblock the Notifications











