‘పవన్ కల్యాణ్ ఎవరికి తలవంచడు.. అలా ఎదురించి నిలబడటానికి కారణం అదే’
మెగా ఫ్యామిలీతో సహజ నటి జయసుధకు బలమైన అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుతోనే కాకుండా పవన్ కల్యాణ్‌తో కలిసి ఆమె పలు చిత్రాల్లో నటించారు. వారి మాదిరిగానే ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ జీవితాన్ని ముందుకు కొనసాగించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా సేవలు అందించారు. తాజాగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
సినిమా పరిశ్రమలో బలమైన పాత్రలు వేస్తూ నటిగా కొనసాగుతున్నారు. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండే ఆమె..
తాజాగా ఏపీలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం గురించి, ఆయన ప్రొఫెషనల్ విజన్ గురించి మంచి మాటలు చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతున్నది. జయసుధ చెప్పిన మాటల విషయానికి వస్తే..

పవన్ కల్యాణ్ వండర్‌ఫుల్ మ్యాన్. ఆయన యాటిట్యూడ్ విషయంలో యాక్టింగ్ ఉండదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా.. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఆయనలో ఎలాంటి మార్పు లేదు. సినిమా రంగంలో ఎవరికీ తలవంచలేదు. రాజకీయ రంగంలో కూడా ఎవరికి తలవంచడం లేదు. తనకు ఓ స్టయిల్ ఉంది. తనకు కొన్ని సిద్దాంతాలు ఉన్నాయి. తనకు పట్టుదల ఉంది కాబట్టే రాజకీయాల్లో అందర్నీ ఎదురించి నిలబడగలిగాడు. పవన్ కల్యాణ్ కాకుండా వేరే వాళ్లు ఉంటే.. ఇప్పటికే వెళ్లిపోయి ఉండే వారు అని సహజ నటి జయసుధ అన్నారు.
పవన్ కల్యాణ్ గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఏదైనా అనుకొంటే మధ్యలో వదిలేసే రకం కాదు. ఆయన పడిన కష్టం. ప్రజా జీవితం పట్ల ఆయనకు ఉండే సిన్సియారిటీనే ఆయనను ఇంతవరకు తీసుకొచ్చాయి. ఆయన కమిట్‌మెంట్ చూసి ఆయనను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే.. రాజకీయ రంగంలో కుళ్లును చూసి మనకెందుకులే అని వెళ్లిపోయి ఉండవచ్చు. కానీ అలా చేయలేదు అని జయసుధ అన్నారు.
సినిమా రంగంలో ఆయన నటిస్తానని అంటే.. ఎంతైనా, ఏదైనా ఇవ్వడానికి నిర్మాతలు, దర్శకులు రెడీగా ఉన్నారు. కానీ వాటన్నింటిని వదులుకొని ప్రజా జీవితానికే మొగ్గు చూపారు. అందుకు ఆయనను అభినందించాలి. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని జయసుధ అన్నారు. పవన్ కల్యాణ్ మంచితనాన్ని జయసుధ ఆకాశానికి ఎత్తేసిన వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. అటు రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను తనదైన ప్రభావాన్ని చూపుతున్నారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడమే కాకుండా గతంలో తాను అంగీకరించిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రంలో నటించారు. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.
పవన్ కల్యాణ్ రాజకీయ రంగం విషయానికి వస్తే.. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించి డిప్యూటీ సీఎం పదవిని అలకరించాడు. ప్రస్తుతం పంచాయితీ రాజ్ వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టారు.


Click it and Unblock the Notifications











