ఆమెది అలాంటి క్యారెక్టర్.. మాజీ మంత్రి రోజాపై క్లాస్‌మేట్ సంచలన వ్యాఖ్యలు
సినీనటిగా 90వ దశకంలో అగ్ర కథానాయికగా వెలుగొందారు రోజా. అప్పట్లో దక్షిణాదిలోని టాప్ స్టార్స్ అందరితో నటించారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే తమిళ స్టార్ డైరెక్టర్ ఆర్కే సెల్వమణితో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె.. అనతికాలంలోనే చంద్రబాబు అభిమానాన్ని సంపాదించి తెలుగు మహిళ అధ్యక్షురాలిగానూ వ్యవహరించారు.
వాడి వేడి విమర్శలతో ప్రత్యర్ధులపై విరుచుకుపడే దూకుడుతనం రోజా సొంతం . 2009 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆమె..అనూహ్య పరిణామాల మధ్య టీడీపీని వీడి వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు. 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఘన విజయం సాధించి మొదటిసారిగా అసెంబ్లీలో కాలుమోపారు. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో జగన్ ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమాలు, పోరాటాలు చేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించగా.. వైసీపీ సైతం అధికారంలోకి రావడంతో ఆమెను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు జగన్. అనంతర కాలంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రోజాకు అవకాశం కల్పించారు.

అయితే 2024 ఎన్నికల్లో రోజా ఓటమి పాలవ్వడంతో పాటు హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. అటు రోజా మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై కూటమి ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్రలో రూ. కోట్లలో అవినీతి వెలుగు చూసింది. ఇక విశాఖలోని రుషికొండ ప్యాలెస్ అక్రమ నిర్మాణంలోనూ ఆమె హస్తం ఉందని, కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకుని బెంజ్ కారు కొన్నారంటూ రోజాపై టీడీపీ నేత గాలి భానుప్రకాష్ ఆరోపణలు గుప్పించారు. ఓటమి తర్వాత ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్న రోజా.. బయట కనిపించడం లేదు. ఇదే సమయంలో ఆమెపై ట్రోలింగ్ సైతం ఓ రేంజ్‌లో జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రోజా క్లాస్‌మేట్, సినీనటి మాధవీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయనకు తరచూ బదిలీ జరిగేవన్నారు. ఈ క్రమంలోనే తిరుపతికి ట్రాన్స్‌ఫర్ అవ్వగా.. తాను అక్కడ బీఎస్సీలో చేరానని, ఆ సమయంలో రోజా తనతో పాటు చదువుకున్నారని మాధవి తెలిపారు. రోజా తొలి చిత్రం ప్రేమతపస్సు చేసేటప్పుడు తాము తిరుపతిలోనే ఉన్నామన్నారు.

నువ్వు పనిమనిషి క్యారెక్టర్‌కు బాగా సరిపోతావంటూ ఆమెను వెక్కిరించేవాళ్లమని మాధవీ గుర్తుచేసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత రోజా హోస్ట్ చేసిన మోడ్రన్ మహాలక్ష్మీ షోలో నేను కూడా పార్టిసిపేట్ చేశానని, నేను మీ డిగ్రీ క్లాస్‌మేట్‌నని గుర్తుచేశానని చెప్పారు. వెంటనే రోజా తనను గుర్తుపట్టి.. అప్పట్లో నేను చాలా కామ్‌గా ఉండేదాన్ని కదా అని అన్నారని మాధవీ తెలిపారు. చదువులో రోజా చాలా చురుగ్గా ఉండేవారని, ప్రేమ తపస్సులో ఆఫర్ వచ్చినప్పుడు.. పనిమనిషి క్యారెక్టర్‌కు సూట్ అవుతుందనే తీసుకున్నారని మాధవీ వెల్లడించారు.
తమిళ్‌లో చేసిన చామంతీతో రోజాకు బ్రేక్ వచ్చిందని.. తనలో వాక్చాతుర్యం, నటనతో పాటు ఇంటెలిజెంట్ అని మాధవీ ప్రశంసించారు. రోజాకి తొలి నుంచి గట్స్ ఉన్నాయని.. అందుకే ఈ స్థాయికి రాగలిగిందని , లేదంటే వెనుక నుంచి లాగేవాళ్లు, కామెంట్స్ చేసేవాళ్లని తట్టుకుని నిలబడటం కష్టమని మాధవీ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రోజాపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











