Nayanthara : ధనుష్‌తో వివాదం.. తండ్రీ కొడుకులిద్దరి పేర్లు తీస్తూ, నయన్ ఓపెన్ లెటర్
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్‌స్టార్ నయనతారల వివాదం చర్చనీయాంశమైంది. తన పెళ్లి డాక్యుమెంటరీ తెరకెక్కించేందుకు 3 సెకన్ల క్లిప్ వాడుకుంటామని అడిగినందుకు ధనుష్ తమను రూ. 10 కోట్లు డిమాండ్ చేశారంటూ నయన్ బయటపెట్టడం, ఆపై కోర్టు కేసులతో వ్యవహారం మాంచి రంజుగా మారింది. ఈ నేపథ్యంలో నయనతార సోషల్ మీడియాలో పెట్టిన తాజా పోస్ట్ చిత్ర సీమలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే.
కోలీవుడ్ క్వీన్, లేడీ సూపర్‌స్టార్ నయనతార .. విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి వీడియోను నయన్ .. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు భారీ రేట్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సంస్థ బియాండ్ ది ఫెయిరీటేల్ అనే పేరిట డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిని నవంబర్ 18న విడుదల చేయాలని అనుకున్నారు.. అయితే ఈ డాక్యుమెంటరీ ఇంత ఆలస్యం కావడానికి హీరో ధనుష్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాదాపు 3 పేజీల లేఖ రాసి ఘాటు విమర్శలు చేసింది లేడీ సూపర్‌స్టార్.

సినిమాల్లో కనిపించే ధనుష్‌కి, బయట కనిపించే ధనుష్‌కి సంబంధం లేదని.. వీరిద్దరూ వేరు వేరని మండిపడింది. సూక్తులు చెప్పే నువ్వు పాటించాలంటూ నయనతార చురకలు వేసింది. నిజానికి నయనతార - విఘ్నేష్‌ల ప్రేమ కథ మొదలైంది నయన్ - ధనుష్ నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమా సమయంలోనే. ఈ చిత్రానికి విఘ్నేష్ దర్శకుడు. తమ జీవితంలో ఎంతో కీలకమైన ఈ సినిమాలోని పాటలు, కొన్ని దృశ్యాలు వినియోగించుకోవడానికి ఆ చిత్ర నిర్మాత ధనుష్ అవకాశం ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది.
అయితే సినిమాలోని క్లిప్స్ కాకుండా బిహైండ్ ది సీన్స్‌లోని తమ వ్యక్తిగత కెమెరాలలో తీసుకున్న విజువల్స్‌ని మూడు సెకన్ల పాటు తీసుకున్న క్లిప్‌ని ఈ డాక్యుమెంటరీలో వినియోగించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధనుష్ కాపీ రైట్ యాక్ట్ కింద రూ. 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో నయన్ - ధనుష్ మధ్య వివాదం తారాస్థాయికి చేరినట్లయ్యింది.
ఇదిలాఉండగా.. డాక్యుమెంటరీ కోసం తమ సినిమాల్లోని క్లిప్స్, లిరిక్స్ వాడుకునేందుకు అవకాశం కల్పించిన సినీ ప్రముఖులకు నయనతార కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ఎన్నో సినిమాలు తన మనసుకు దగ్గరయ్యానని.. వాటిని తన డాక్యుమెంటరీలో చేర్చాలని అడిగినప్పుడు సదరు దర్శక నిర్మాతలు ఎలాంటి అభ్యంతరం తెలపలేదని వారందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు. ఇందులో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు. వీరితో పాటు షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ తదితర స్టార్స్‌కు కూడా నయనతార కృతజ్ఞతలు తెలిపారు. తనను విమర్శించి మిగిలిన హీరోలకు నయన్ థాంక్స్ చెప్పడంతో ధనుష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











