మీ వల్ల నా జీవితం నాశనమైంది.. తెలుగు న్యూస్ ఛానెల్ ఓనర్‌పై పూనం కౌర్ ఆరోపణలు
చేతిలో సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు పంజాబీ ముద్దుగుమ్మ పూనం కౌర్. ప్రస్తుతం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న కొండా సురేఖ వ్యాఖ్యలు, సమంత- నాగచైతన్య విడాకుల అంశంపై ఆమె కూడా స్పందించారు. అయితే గతంలో ఎప్పుడో జరిగిన విషయాలను తవ్వి తీసే పూనమ్ తన తాజా ట్వీట్‌లో ఓ న్యూస్ ఛానెల్ అధిపతి పేరును తీసుకొచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే:
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జాతిపితకు నివాళులర్పించిన మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సమంత - నాగచైతన్య విడాకులను ప్రస్తావించారు. ఈ జంట విడిపోవడానికి కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులతో పాటు టాలీవుడ్ వర్గాలు భగ్గుమన్నాయి. నాగార్జున, నాగచైతన్య, సమంత, జూనియర్ ఎన్టీఆర్, నాని, రామ్ గోపాల్ వర్మ, వెంకటేష్ , కోన వెంకట్ సహా పలువురు ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యవహారంపై అక్కినేని నాగార్జున ఏకంగా పరువు నష్టం దావా వేయడం వరకు విషయం వెళ్లింది.

ఇక టాలీవుడ్‌లో, తెలుగు రాజకీయాల్లో ఏం జరిగినా తక్షణం స్పందిస్తారు హీరోయిన్ పూనం కౌర్. మొన్నామధ్య కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూపైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. జానీని మాస్టర్ అని పిలవొద్దని, అలా పిలవాలంటే గౌరవం ఉండాలని చురకలంటించారు. చాలా మంది సినీ ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని, ఇందుకోసం పలు కమిటీలు కూడా వేశారని.. కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని పూనం కౌర్ మండిపడ్డారు. తాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు చేసిన ఫిర్యాదును ఎందుకు పట్టించుకోలేదని పూనం కౌర్ ప్రశ్నించారు.
తాజాగా సమంత - నాగచైతన్యలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైనా పూనం స్పందించారు. అసలు విషయాన్ని వదిలేసి మళ్లీ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పేర్లను ఆమె బయటికి తీశారు. గతంలో పవన్‌పై పోసాని కృష్ణమురళి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడని.. వారి ఇంట్లోని ఆడవాళ్ల గురించి కూడా తీశాడని పూనం గుర్తుచేశారు. మరి టాలీవుడ్ వర్గాలు అప్పుడెందుకు స్పందించ లేదని ఆమె కడిగిపారేశారు. పూనం కౌర్ వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.

ఇదిలాఉండగా .. సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ స్పందించారు. తెలుగు సమాజంలో స్త్రీలను గౌరవించడం ప్రధానమని.. కానీ ఇప్పటి రాజకీయాలను చూస్తుంటే నాకే సిగ్గేస్తోందన్నారు. ఒక స్త్రీ అయ్యుండి.. మరో స్త్రీని అవమానించడం చూస్తుంటే రాజకీయంగా ఎంత దిగజారామో అనిపిస్తోందని రవిప్రకాష్ ట్వీట్ చేశారు. దీనిపై పూనంకౌర్ స్పందించారు. మీ కార్యక్రమాల వల్ల నా జీవితం నాశనమైందని, ఓ దళిత బిడ్డను బలి పశువుని చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పూనం ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











