సుగాలి ప్రీతి కేసును కదిపిన పూనం కౌర్.. ఆయనను టార్గెట్ చేస్తూ సంచలన పోస్ట్
చేతిలో సినిమాలు లేకపోయినా , అసలు నటిస్తుందో లేదో తెలియకపోయినా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు పూనం కౌర్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉన్న ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ ఏడాది ఆగస్ట్ 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి దాదాపు 3 నెలలు కావొస్తున్నా బాధితురాలికి న్యాయం జరగడం లేదంటూ వైద్యులు మరోసారి ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో పూనం స్పందించారు. ఈ కేసుతో ముడిపెడుతూ ఏపీలోని సుగాలి ప్రీతి ఘటనను టచ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌లో, దేశంలో ఎక్కడ ఏం జరిగినా తక్షణం స్పందిస్తారు హీరోయిన్ పూనం కౌర్. మొన్నామధ్య కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూపైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చాలా మంది సినీ ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని, కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని పూనం మండిపడ్డారు. తాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు చేసిన ఫిర్యాదును పట్టించుకున్న వారు లేరంటూ ఫైర్ అయ్యారు.

సమంత - నాగచైతన్య విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైనా పూనం స్పందించారు. గతంలో పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణమురళి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడని ఆమె గుర్తుచేశారు. ఇంట్లోని ఆడవాళ్ల గురించి, చివరికి తన పేరు కూడా తీశాడని పూనం గుర్తుచేశారు. మరి టాలీవుడ్ వర్గాలు అప్పుడెందుకు స్పందించ లేదని ఆమె కడిగిపారేశారు. సురేఖ ఇష్యూపై సీనియర్ జర్నలిస్ట్ , ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ స్పందించగా ఆయనకు కూడా కౌంటరిచ్చారు పూనం. మీ కార్యక్రమాల వల్ల నా జీవితం నాశనమైందని, ఓ దళిత బిడ్డను బలి పశువుని చేశారని ఆయన ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చారు.
ఆర్జీ కార్ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో విధులు నిర్వర్తిస్తున్న యువ వైద్యురాలు .. తెల్లారేసిరికి ఆసుపత్రి ఆవరణలో శవమై కనిపించారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధులు.. అత్యంత పాశవికంగా హతమార్చారు. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దాదాపు నెల రోజుల పాటు దేశంలో వైద్య సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతుండగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి వైద్యులను శాంతిపజేశారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కనిపించకపోవడంతో, బాధితురాలికి న్యాయం చేయాలంటూ యువ వైద్యులు మరోసారి రోడ్డెక్కారు.
ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై పూనం కౌర్ స్పందించారు. ఎంతో మందిని ఇది షాక్‌కు గురిచేసిందన్న ఆమె.. ఇది న్యాయం కోసం పోరాడటం కాదని, ఎంత మందిని అణిచివేశారు, అలాంటి ఎంత మంది నేరస్థులకు రక్షణ కల్పించారు అనే దానిపైనా ఆలోచించాలని సూచించారు. దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో సుగాలి ప్రీతి కేసుపై దర్యాప్తు జరపాలని తాను అభ్యర్ధిస్తున్నానని పూనం ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఎవరిని టార్గెట్ చేసి ఈ ట్వీట్ పెట్టారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











