’పెళ్లి ఇష్టం లేదు.. కానీ అలాంటి రిలేషన్‌లో ఉండాలని ఉంది‘
ఒకప్పుడు హీరోయిన్‌లుగా వెండితెరను ఏలినవారు తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా టర్న్ తీసుకుంటున్నారు. అయితే చిన్న వయసులోనే హీరోలు, హీరోయిన్లకు తల్లి పాత్రలు పోషించిన వారు కూడా ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు ప్రగతి. తొలుత హీరోయిన్‌గా నటించిన ఆమె తర్వాత సహాయక పాత్రల వైపు వచ్చారు. కేవలం 24 ఏళ్ల వయసులోనే తన వయసున్న హీరోయిన్‌కు తల్లిగా నటించారు. క్లాస్ లుక్‌లో తల్లి, అక్క, వదిన వంటి క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. ముఖంపై చిరునవ్వు, నిండైన రూపంతో కనిపించే ప్రగతికి సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన ప్రగతి తొలుత మైసూర్ సిల్క్ ప్యాలెస్‌కు మోడల్‌గా వ్యవహరించారు. ఈ దశలో సినిమాలపై ఆసక్తితో మద్రాస్ వెళ్లిన ప్రగతికి తమిళనటుడు భాగ్యరాజ్ అవకాశం కల్పించారు. ఈయన తెరకెక్కించిన వీట్ల విశేషాంగ సినిమాతో ప్రగతి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి తెలుగు, తమిళ, మలయాళ , కన్నడ చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ప్రగతికి పెళ్లి కావడంతో మూడేళ్ల పాటు నటనకు దూరమయ్యారు. అనంతరం సీరియల్స్ ద్వారా తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు సీరియల్స్‌లో నటించారు.

50కి చేరువ అవుతున్నా ప్రగతిది చెక్కు చెదరని అందం. వయసు పైబడుతున్నా ఫిట్‌నెస్ విషయంలో మాత్రం రాజీ పడేది లేదని ఆమె చెబుతుంటారు. గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేయడమే కాదు, ఈ వయసులోనూ టైట్ ఫిట్‌లు, స్లివ్‌లెస్ జాకెట్లు వేసుకుని కనిపిస్తుంటారు. ఈ విషయంలో ఎవరెన్ని అన్నా తగ్గేదే లేదంటూ ఎప్పటికప్పుడు వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు ప్రగతి. అంతేకాదు ఏకంగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని ప్రొఫెషనల్స్‌కే పోటీ ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు.
కెరీర్‌లో స్టార్ స్టేటస్ అందుకున్నప్పటికీ ప్రగతి వైవాహిక జీవితం మాత్రం ఒడిదొడుకుల మధ్యే సాగింది. చిన్న వయసులోనే వివాహం చేసుకున్నప్పటికీ భర్త తీరుతో విసిగిపోయిన ఆమె అతనికి విడాకులు ఇచ్చి కుమార్తెతో పాటు బయటకు వచ్చేశారు. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో పెళ్లి చేసుకోవాలని తాను తీసుకున్న నిర్ణయం జీవితంలో అతిపెద్ద పొరపాటని ప్రగతి తెలిపారు. ఆ నిర్ణయం వల్ల తన జీవితం 10 , 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
అయితే రెండో పెళ్లి గురించి , తన క్యారెక్టర్ గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తుంటాయి. వాటికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారు ప్రగతి . తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ.. పెళ్లి, తోడు ముఖ్యమేనని కానీ నా మెచ్యూరిటీ లెవల్‌కు సరైన వ్యక్తి దొరక్కుంటే మళ్లీ కష్టమేనంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పెళ్లయ్యాక నువ్వు ఇలాగే ఉండు, ఇలా చేయ్ అంటూ కట్టుబాట్లు పెడితే నేను భరించలేనని ప్రగతి తెలిపారు. బహుశా నాకిప్పుడు 20 ఏళ్ల వయసు ఉండి ఉంటే గనుక ఆలోచించే దాన్నని , కానీ నా చేయి దాటిపోయిందన్నారు. సొసైటీకి మాత్రం మంచి పిల్లలను ఇచ్చానని.. ఆ విషయంలో గర్వంగా ఫీలవుతానని ప్రగతి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











