కన్నడ స్టార్ హీరోయిన్‌కి జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు
ప్రభుత్వం, పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎంతగా నిఘా పెట్టినా మనదేశంలోకి అక్రమంగా బంగారం, డ్రగ్స్, ఇతర వస్తువులను స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నా వారిలో మార్పు రావడం లేదు. ఇలాంటి కేసుల్లో సెలబ్రెటీలు కూడా అధికారులకు చిక్కడం చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది మార్చిలో కన్నడ నటి రన్యా రావు.. అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఘటన చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.
14.7 బంగారంతో పట్టుబడ్డ రన్యారావు
కర్ణాటకలోని చిక్ మగళూరుకు చెందిన రన్యా రావు 2014లో కిచ్చా సుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన మాణిక్యలో హీరోయిన్‌గా నటించారు . తర్వాత వాఘా, పటాకీ సినిమాలలో నటించారు. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబట్టారు రన్యా రావు. ఆమె వద్ద దాదాపు 14.7 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రన్యారావును అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు విచారణ జరిపారు.

తండ్రి హోదాతో స్మగ్లింగ్
ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రన్యా రావు సవతి తండ్రి, కర్ణాటక పోలీస్ శాఖలో డీజీపీ ర్యాంక్ అధికారి కె రామచంద్రరావు. ఆయన హోదాను అడ్డుపెట్టుకుని చెకింగ్ వంటి మినహాయింపుల ద్వారా స్మగ్లింగ్‌కు పాల్పడినట్లుగా తేలింది. దర్యాప్తులో భాగంగా రన్యారావు ఇంటిపై పోలీసులు, డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించగా.. 2.06 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 2.67 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక ప్రభుత్వం సీరియస్
రన్యారావు గతంలోనూ పలుమార్లు ఇండియాకు అక్రమ మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లుగా పోలీసులు నిర్దారించారు. ఈ కేసులో రన్యా రావుతో పాటు మరో ఇద్దరు అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. విపక్షాల ఆరోపణలు నేపథ్యంలో డీజీపీ రామచంద్రరావు ప్రమేయంపై సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. మనీలాండరింగ్, హవాలా కోణాలు వెలుగులోకి రావడంతో ఈడీ అధికారులు రన్యారావుకు చెందిన రూ.34 కోట్లు సీజ్ చేసింది.
కాఫీఫోసా చట్టం కింద కేసు
అరెస్ట్ అయిన నాటి నుంచి రన్యారావు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించగా బెంగళూరులోని ఆర్ధిక నేరాల కోర్ట్ పలుమార్లు తిరస్కరించింది. అంతేకాదు.. ఆమెపై అత్యంత కఠినమైన విదేశీ మాదక ద్రవ్యం, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం -1974ను (కాఫీఫోసా) చట్టం ప్రయోగించారు. దీని కింద కేసు నమోదైతే ఏడాది పాటు బెయిల్ వచ్చే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీని వల్లే ఆమెకు స్పెషల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసినప్పటికీ విడుదల కాలేదు.
రన్యారావుకు ఏడాది జైలుశిక్ష
తాజాగా తన బెయిల్ పిటిషన్ రద్దు చేయడంపై రన్యా రావు తల్లి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన ధర్మాసనం రన్యారావు పిటిషన్ రద్దు చేయడంతో పాటు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. దీంతో రన్యారావు జైలుకు వెళ్లాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. పైగా బలమైన కాఫీఫోసా చట్టం ఆమెపై నమోదు కావడంతో ఏడాది వరకు బెయిల్ వచ్చే పరిస్ధితులు లేవు. మరి రన్యా రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











