అక్కినేని వారి పెళ్లి సందడి : కీలక ఘట్టం పూర్తి , శోభితకి మంగళస్నానం.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య , సినీ నటి శోభితా ధూళిపాళ త్వరలో వివాహ బంధం ద్వారా ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే . వీరి మధ్య ఎప్పటి నుంచో ఏదో నడుస్తోందని మీడియాలో వార్తలు రాగా అంతా కొట్టిపడేశారు. కానీ చివరికి వాటిని నిజం చేస్తూ వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యింది. నిశ్చితార్ధం జరిగిన క్షణం నుంచి వీరి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరుగుతుంది? గెస్ట్‌లు ఎవరు? అనేది హాట్ టాపిక్ మారింది.
సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా జీవితం నెట్టుకొస్తున్న తమ హీరో ఓ ఇంటి వాడు కావడంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పెళ్లికి సంబంధించి రెండు కుటుంబాలు చాలా గుట్టుగా ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వధువు శోభిత ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. పట్టు చీరలో ముస్తాబైన శోభితా ముత్తయిదువులు వెంట రాగా పసుపు కొమ్ములను దంచారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు, పెద్దల ఆశీర్వాదం తీసుకొంటూ శోభిత కనిపించారు.

ఇక ఈ ఏడాదికి గాను ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్‌ను మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తనకు కాబోయే కోడలు శోభితను చిరంజీవి, అమితాబ్ తదితరులకు పరిచయం చేశారు నాగార్జున. అలాగే అక్కినేని ఫ్యామిలీ మొత్తం దిగిన గ్రూప్ ఫోటోలోనూ శోభిత ఫోజులిచ్చారు.
గోవా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోని విలాసవంతమైన ప్యాలెస్‌లలో నాగచైతన్య - శోభితల వివాహం జరుగుతుందని.. లేదు ఫారిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ చివరికి హైదరాబాద్‌లో ఈ జంట ఒక్కటి కానున్నట్లుగా కన్ఫర్మ్ అయ్యింది. అది కూడా అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియో ఇందుకు వేదిక కావడం విశేషం. డిసెంబర్ 4న జరగనున్న ఈవెంట్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక కాబోయే కోడలు శోభిత కోసం అక్కినేని కుటుంబ సభ్యులు ఖరీదైన కానుకలు, బహుమతులు సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రూ. కోటికి పైగా విలువైన టయోటా లెక్సస్ కారును శోభిత కోసం చైతూ కొన్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు ఖరీదైన బంగారు ఆభరణాలను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇదిలాఉండగా.. పెళ్లి పనులకు సంబంధించి శోభిత కీలక అప్‌డేట్‌ను పంచుకున్నారు. రాటా .. స్తపన, మంగళ స్నానం అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేశారు. పసుపు రంగు చీర కట్టుకున్న శోభితకు కుటుంబ సభ్యులు మంగళ స్నానం చేయించిన ఫోటోలను ఇందులో చూడొచ్చు. అనంతరం తల్లిదండ్రులు, సోదరితో కలిసి దిగిన గ్రూప్ ఫోటోను శోభిత ధూళిపాళ పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











