నా కేసును తొక్కేయడానికి.. కోట్లు గుమ్మరిస్తున్నాడు.. అర్జున్ రెడ్డి నటి షాకింగ్ కామెంట్స్
తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువ మహిళ కొరియోగ్రాఫర్ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించగా.. బెయిల్ తెచ్చుకున్నారు. అయితే జానీ మాస్టర్‌కు వచ్చిన నేషనల్ అవార్డ్‌ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. జానీ మాస్టర్ కేసు నేపథ్యంలో గతంలో టాలీవుడ్‌లో నమోదైన లైంగిక వేధింపుల వ్యవహారాలు మరోసారి ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి.
తెలుగులో హీరో, హీరోయిన్ల ఫ్రెండ్ రోల్స్, వాంప్ తరహా రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీసుధ భీమిరెడ్డి. బాడీగార్డ్, దమ్ము, ఎవరు, అవును , అర్జున్ రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, రూలర్, వలయం, వేర్ ద వెంకట లక్ష్మీ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆమె సినీ నటి మాత్రమే కాదు.. ఫిజియోథెరపిస్ట్ కూడా . సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇక బోల్డ్ కామెంట్స్ చేయడంలో శ్రీసుధ ఎప్పుడూ ముందుంటారు. ఎవరు ఏమనుకున్నా సరే కుండబద్ధలు కొడతారు. ఇందులో నో కాంప్రమైజ్.

కొద్దిరోజుల క్రితం విమానంలో ప్రయాణిస్తుండగా ఆమెకు ఓ ఆకతాయి నుంచి చేదు అనుభవం ఎదురైంది. శ్రీసుధ వెనుక సీట్లో కూర్చొన్న ఓ వ్యక్తి అతని కాళ్లను ముందుకు చాస్తూ అసభ్యంగా ఆమెను తాకే ప్రయత్నం చేశాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు, ఫ్లైట్ క్రూ సిబ్బందికి చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆ ఆకతాయి చెంప చెళ్లుమనిపించింది సుధ. తనను ఆ వ్యక్తి ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడో తెలియజేస్తూ అప్పట్లో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటో వైరల్ అయ్యింది.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేశాడని శ్రీసుధ చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఆరోపణలే కాదు ఏకంగా పోలీస్ స్టేషన్‌కి అక్కడి నుంచి కోర్టుల వరకు వ్యవహారం వెళ్లింది. ఇప్పటికీ తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోరాటం చేస్తోంది. శ్యామ్‌తో తనకు రాజీ జరిగిదందని ఓ పోలీస్ ఆఫీసర్ ఫోర్జరీ పేపర్స్ సృష్టించాడని మరో బాంబు పేల్చింది. అలాగే పలువురు సినీ పెద్దలు .. శ్యామ్‌పై తాను పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలని ఒత్తి చేశారని శ్రీసుధ ఆరోపించింది.

తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీసుధ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శ్యామ్‌తో కాంప్రమైజ్ కాలేదని స్పష్టం చేశారు. తాను పెట్టుకున్న లాయర్లను అతను మేనేజ్ చేస్తున్నాడని శ్రీసుధ ఆరోపించారు. లాయర్లు - లాయర్లు కుమ్మక్కై కేసు వాయిదా పడేలా చేస్తున్నారని ఆమె తెలిపారు. తన కోసం కాఫీకి ఖర్చు పెట్టనివాడు, ఇప్పుడు కోట్లు గుమ్మరిస్తున్నాడని శ్రీసుధ ఆరోపించారు. శ్యామ్ వాళ్ల ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే నా దగ్గరికొచ్చి తలబాదుకునేవాడని, నా ఇంట్లోని వస్తువులు, ఫోన్‌లు పగులగొట్టాడని ఆమె పేర్కొన్నారు.
ఐదేళ్లు రిలేషన్‌లో ఉన్నప్పుడు రేప్ ఎలా జరుగుతుంది కొందరు నన్ను క్వశ్చన్ చేశారని శ్రీసుధ వెల్లడించారు. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే అత్యాచారాలలో 90 శాతం తెలిసినవాళ్ల వల్లే జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుని కొందరు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని శ్రీసుధ చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











