స్టార్ హీరోలు లేరు... అందుకే పందితో పాదయాత్ర: రవిబాబు సంచలనం!
సినిమాలకు ప్రచారం కల్పించాలంటే ఆడియో రీలీజ్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, బస్సు యాత్రలు నిర్వహించడం చూశాం. ఇందులో నటీనటులు, చిత్ర బృందం పాల్గొంటారు షరా మామూలే. అయితే విలక్షణ నటుడు, దర్శకుడు రవి బాబు తన తాజా చిత్రం 'అదుగో' ప్రమోషన్స్ కోసం వినూత్న ఆలోచన చేశారు. పంది పిల్లతో పాదయాత్ర నిర్వహించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబీర్ పార్క్ నుంచి ఫిల్మ్ చాంబర్ వరకు శుక్రవారం బంటీ(పంది పిల్ల), 'అదుగో' చిత్ర బృందంతో కలిసి రవిబాబు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పాదయాత్ర వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటనే విషయం వెల్లడించారు.

మా సినిమాలో హీరోలు లేరు, అందుకే పంది పిల్లతో...
రవిబాబు మాట్లాడుతూ... సినిమాలకు జనరల్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో రిలీజ్ ఈవెంట్స్ చేస్తారు. అలాంటి సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలు, రకరకాల స్టార్స్ ఉంటారు. ఫ్యాన్స్ వారిని చూడటానికి ఆ వేడుకలకు వస్తారు. మా సినిమాలో అలాంటి వారు ఎవరూ లేరు. ఇందులో స్టార్ ఒక చిన్న పంది పిల్ల.... అందుకే పంది పిల్లతో పాదయాత్ర నిర్వహించామని తెలిపారు.

నవంబర్ 7న ‘అదుగో'
పంది పిల్లతో ప్రీరిలీజ్ ఈవెంట్ చేయలేం... అందుకే ఇలాంటి ఆలోచన చేశాం, మా సినిమా ‘అదుగో' ఈ నెల 7న విడుదల చేస్తున్నాం. అది అందరికీ చెప్పాలనుకుంటున్నాం. ఆ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక ఈ ఐడియాతో ముందుకు వచ్చామని రవిబాబు తెలిపారు.

పంది పిల్ల కథ
‘అదుగో' ఓ పందిపిల్ల చుట్టూ తిరిగే కథ... ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నాభ, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేంద్ర చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. . 3డి యానిమేషన్ సీన్లు, గ్రాఫిక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయని చిత్ర బృందం చెబుతోంది.
ఆసక్తి పెంచిన ట్రైలర్
టాలీవుడ్లో పంది పిల్లపై సినిమా రావడం ఇదే తొలిసారి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తి మరింత పెంచింది. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











