పవన్ ‘వీరమల్లు’ షూటింగ్‌లో ప్రమాదం: ప్రముఖ నటుడికి గాయాలు.. చెన్నై తరలింపు
రీఎంట్రీలో ఫుల్ జోష్ మీదున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే మూవీలో నటించాడాయన. కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇంకా విడుదల కాకముందే టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో 'హరిహర వీరమల్లు' అనే సినిమాను చేస్తున్నాడు. పిరియాడిక్ జోనర్‌లో మొగల్ సామ్రాజ్యం నాటి కథతో తెరకెక్కుతోంది. దాదాపు రూ. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ స్పాట్‌లో ఓ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజా షెడ్యూల్‌లో కీలక నటులపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు తీస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం గుర్రాలతో ఛేజింగ్ సీన్స్ షూట్ చేస్తుండగా.. ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ కింద పడినట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గాయపడిన ఆయనను ముందుగా నగరంలోని యశోదా అస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారట. ఆ తర్వాత చెన్నైకు తరలించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

ఆదిత్య మీనన్ తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా విలన్ పాత్రలనే పోషించారు. ఇక, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తీస్తున్నారు. ఇందులో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











