F3 తరువాత బాలయ్య - ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
మొదట సినిమా ఇండస్ట్రీలో మంచి రచయిత గుర్తింపును అందుకున్న అనిల్ రావిపూడి ఆ తర్వాత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాల తో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తర్వాత చేసిన ఎఫ్ 2 సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ స్థాయిలో లాభాలను అందించడంతో మహేష్ బాబు కూడా అతనితో సినిమా చేసేందుకు ఏ మాత్రం సందేహించలేదు.
ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఇండస్ట్రీ లో అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకులలో ఒకరుగా మారిపోయారు. ప్రస్తుతం ఈ దర్శకుడు ఎఫ్ 2 సినిమా కు ఫ్రాంచైజ్ గా కొనసాగిస్తూ ఎఫ్ 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈనెల 29వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోయే ఈ సినిమా తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ రప్పిస్తుంది అని దిల్ రాజు కూడా నమ్మకంతో ఉన్నారు.

అయితే ఈ సినిమా అనంతరం దర్శకుడు అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా మొత్తానికి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆ సినిమా సెప్టెంబర్ లో మొదలవుతుందని కూడా వివరణ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఆ తర్వాత ఆయన కోసం కథలు రెడీ చేసుకున్న దర్శకులు అయితే చాలామంది ఉన్నారు కానీ ఎక్కువగా బాలయ్యబాబు అనిల్ రావిపూడి తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా క్లారిటీ అయితే వచ్చేసింది ప్రస్తుతం స్క్రిప్ట్ మొత్తం రెడీ అయింది అని చెప్పిన అనిల్ వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తామని కూడా వివరణ ఇచ్చాడు.
అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అనిల్ రావిపూడి ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అనిల్ రావిపూడి కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ తో సినిమా చేయడం మాత్రం పక్క అంటూ.. ఇంకా ఏ కథను కూడా ఫైనల్ చేసుకోలేదు అని వివరణ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి అయితే ప్రస్తుతం బాలకృష్ణ కోసం ఓ మంచి కథను సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నాడు. గతంలోనే వీరి కలయికలో ఒక సినిమా రావాల్సిందే. ఆ సినిమాకు రామారావు అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ బాలయ్యబాబు ప్రణాళికలు మార్చడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. మరి ఈసారి చేయబోయే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











