మహేష్ బాబుతో సినిమాపై బుచ్చిబాబు క్లారిటీ.. ఈసారి ఏం కట్ చేస్తారంటూ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరెకెక్కిన పెద్ది చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మూడు రోజులు తిరిగేసరికి 200 కోట్ల క్లబ్‌లో చేరిన పెద్ది.. 300 మార్క్ దిశగా దూసుకెళ్తోంది. రామ్ చరణ్ నటన బుచ్చిబాబు టేకింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పెద్ది దెబ్బతో ఇండస్ట్రీలో బుచ్చిబాబు పేరు మారుమోగుతోంది. బడా నిర్మాణ సంస్థలు, హీరోలు ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు సానా.. గురువు దగ్గర డైరెక్షన్‌లోని అన్ని రకాల నైపుణ్యాలు సంపాదించి ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్నాడు. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు.. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌కి అరంగేట్రంలోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందించారు. దాంతో తన తదుపరి సినిమాను బుచ్చిబాబు ఎవరితో చేయబోతున్నారా అన్న ఉత్కంఠ నెలకొంది. బుచ్చిబాబు చెప్పిన కథకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌ఓకే చెప్పడంతో వీరిద్దరి కాంబోపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్స్, కరోనా వైరస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు రామ్ చరణ్.

గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో మెగా అభిమానులకు ఎలాగైనా హిట్ అందించాలని చరణ్- బుచ్చిబాబులు ఎంతో కష్టపడ్డారు. దానికి ప్రతిఫలమే పెద్ది ఘన విజయం. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అతనిని ఇలా చూపించిన బుచ్చిబాబుపైనా అదే స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఉప్పెన, పెద్ది ఘన విజయాలతో బుచ్చిబాబు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా స్థానం సంపాదించుకున్నాడు. దాంతో బుచ్చిబాబు హ్యాట్రిక్ మూవీ ఏ హీరోతో చేయనున్నారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో బుచ్చిబాబు సినిమా ఉంటుందని టాక్. దీనిపై తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
పెద్దికి అనూహ్యమైన స్పందన వస్తోంది.. రెండు మూడు థియేటర్లకు వెళితే రామ్ చరణ్ గారిని పట్టుకున్నట్లు నన్ను కూడా పట్టుకుని ఏడ్చేస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. నేను ఏదైతే రాసుకున్నానో, అది స్క్రీన్ మీద ఆడియన్స్, ఫ్యామిలీస్ మొబైల్ తీసి క్యాప్చర్ చేస్తే 75 శాతం చిన్నపిల్లలు, ఆడవాళ్లు, అమ్మాయిలే ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీలు సినిమాను పట్టేసుకున్నారు. చాలా చాలా కాల్స్ వస్తున్నాయి. అందరికీ చాలా థ్యాంక్యూ అండీ.. ఒక సినిమాని నేను, చరణ్ సార్ ఎంతగా గట్టిగా నమ్మామో, మీరు కూడా అంతే నమ్మారు. నేను ఒక థియేటర్‌లో చూస్తే ఒకావిడ కళ్లను తుడుచుకుంటోంది. వాళ్లాయన ఆపుకోమని ఓదారుస్తున్నారు. స్క్రీన్ లైట్ ఆమె ఫేస్ మీద పడినప్పుడల్లా కనిపిస్తోంది.. వచ్చిన పని అయిపోయిందని అనిపించిందని బుచ్చిబాబు పేర్కొన్నారు.
మీ తదుపరి చిత్రం ఎవరితో అని యాంకర్ పశ్నించగా.. అది జరుగుతోంది, చెబుతానని బుచ్చిబాబు అన్నారు. మహేశ్ బాబు గారికి మీరు ఒక స్టోరీ చెప్పారని విన్నాం, ఆ స్టోరీలో కూడా ఏదైనా అవయవాన్ని కట్ చేస్తారా అని యాంకర్ అడగ్గా.. అలాంటిదేమీ లేదు, కథలో వస్తే రావొచ్చు అని సరదాగా నవ్వేశారు బుచ్చిబాబు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో వారణాసి సినిమాలో నటిస్తున్నారు మహేశ్. వారణాసి పూర్తవ్వగానే ఆయనతో సినిమాలు తీసేందుకు ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి టాప్ డైరెక్టర్లు రెడీగా ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. మరి ఇలాంటి పరిస్ధితుల్లో బుచ్చిబాబు కథకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఇస్తే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications


