శృతిహాసన్, ఉన్ని ముకుందన్ .. సినీ తారలపై హ్యాకర్స్ పంజా.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
టెక్నాలజీ యుగంలో ప్రజల కోసం అనేక సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. సాంకేతికత ముసుగులో కొత్త కొత్త ప్రమాదాలు కూడా ముంచుకొస్తున్నాయి. వాటిలోనే సైబర్ అటాక్, హ్యాకింగ్ వంటివి ముఖ్యమైనవి. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్‌లోకి హ్యాకర్లు చొరబడి అత్యంత రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. పలువురి ఖాతాలను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, సమాచారాన్ని లీక్ చేస్తామంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. ఇటీవల ప్రపంచ ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఏకంగా 16 బిలియన్ (1600 కోట్లు) యూజర్ ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్స్, ఇతర వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్లుగా నిపుణులు బయటపెట్టడం దిగ్భ్రాంతి కలిగించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఏదో ఒక రూపంలో హ్యాకర్లు చొరబడుతూనే ఉన్నారు.
సెలబ్రెటీలపై హ్యాకర్ల కన్ను
అభిమానులతో టచ్‌లో ఉండటానికి సెలబ్రెటీలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను ఉపయోగిస్తున్నారు. తమ సినిమాలు, షూటింగ్స్ , ఇతర వ్యక్తిగత వివరాలను వీటి ద్వారా పంచుకుంటున్నారు. తమ సినిమాల ప్రమోషనల్ కార్యక్రమాలకు కూడా సోషల్ మీడియాను బాగానే వాడేస్తున్నారు సెలబ్రెటీలు. అయితే ఇటీవలి కాలంలో పలువురు నటీనటుల సోషల్ మీడియా హ్యాండిల్స్ హ్యాక్ అవుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది.

శృతిహాసన్ ఎక్స్ ఖాతా హ్యాక్
కొద్దిరోజుల క్రితం సంగీత దర్శకుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ డి. ఇమాన్ ఎక్స్ ఖాతా హ్యాక్ అయ్యింది. ఆ తర్వాత నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఎక్స్ ఖాతా కూడా హ్యాక్ కావడం చర్చనీయాంశమైంది. తాజాగా యూనివర్సిల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం కలకలం రేపింది. తన ట్విట్టర్ వాల్‌పేజీలో క్రిప్టో కరెన్సీకి చెందిన పోస్ట్ కనిపించడంతో షాకైన శృతిహాసన్ .. పేజీ హ్యాక్ అయినట్లుగా గుర్తించారు. ఆమె ట్విట్టర్ ఖాతాకు దాదాపు 75 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో హ్యాకర్స్ ఆమె ఖాతాను హ్యాక్ చేసి క్రిప్టో కరెన్సీపై ప్రచారం చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాకు శృతి బ్రేక్
తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లుగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శృతీ హాసన్ అభిమానులకు తెలిపారు. ఎవరూ తన ట్విట్టర్ ఖాతాతో ఇంటరాక్ట్ అవ్వొద్దని శృతిహాసన్ హెచ్చరించారు. త్వరలోనే తన ఖాతాను అందుబాటులోకి తీసుకొస్తానని తెలిపారు. ఈ ఖాతాను తిరిగి పునరుద్ధరించడానికి తనకు 3 రోజుల సమయం పట్టింది. ఇదే సమయంలో శృతిహాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజులు సోషల్ మీడియా ఖాతాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. నిశ్శబ్ధాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నట్లు సోమవారం తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌కు తెలియజేశారు.
షాకిచ్చిన ఉన్నిముకుందన్
శృతిహాసన్ ఎపిసోడ్ సద్దుమణగకముందే మరో సెలబ్రెటీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఆయనెవరో కాదు .. మలయాళ యువ హీరో, మార్కో ఫేమ్ ఉన్ని ముకుందన్. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లుగా స్వయంగా ఆయనే తెలియజేశారు. దీనిని పునరుద్ధరించేందుకు తన టీమ్ కృషి చేస్తోందని.. అకౌంట్ తిరిగి తన నియంత్రణలోకి వచ్చిన తర్వాత తానే అప్‌డేట్ ఇస్తానని ఫేస్‌బుక్ పేజీ ద్వారా తెలియజేశారు. దీంతో తమ సోషల్ మీడియా ఖాతాలు ఎక్కడ హ్యాకింగ్‌కు గురవుతాయోనని సెలబ్రెటీలు బిక్కుబిక్కుమంటున్నారు. ఒకరి తర్వాత మరొక సెలబ్రెటీ ఎక్స్ ఖాతాలు ఎందుకు హ్యాక్ అవుతున్నాయి? కావాలని టార్గెట్ చేస్తున్నారా? ఈ హ్యాకింగ్ వెనుక ఉన్న శక్తులెవరు? అంటూ కథనాలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











