నిర్మాత అనిల్ సుంకర 30 కోట్ల మోసం.. ఈడీకి ఫిర్యాదు చేస్తాం.. కోర్టులో కేసు వేసిన ఏజెంట్ డిస్టిబ్యూటర్
భోళా శంకర్ సినిమా నిర్మాత, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత అనిల్ సుంకరపై చీటింగ్ కేసు నమోదైంది. అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో తనను నమ్మించి మోసం చేశారనే ఆరోపణలతో డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ అలియాస్ వైజాగ్ సతీష్ కోర్టును ఆశ్రయించారు. భోళా శంకర్ రిలీజ్‌కు ముందు కోర్టులో కేసు విషయాన్ని తెలియజేసేందుకు మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. వైజాగ్ సతీష్ వెల్లడించిన ప్రకటన సారాంశం ఏమిటంటే..
ఏజెంట్ మూవీ డిస్ట్రిబ్యూషన్ కోసం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం 30 కోట్ల రూపాయలు చెల్లించాను. ఈ మేరకు నా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ గాయత్రి దేవి ఫిలింస్‌తో అగ్రిమెంట్ కూడా చేసుకొన్నారు. దాంతో నేను నా మిత్రులతో కలిసి 30 కోట్లు వైట్ మనీ రూపంలో థియేట్రికల్ రైట్స్ కోసం బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించాను. కానీ రిలీజ్ సమయంలో కేవలం మాకు వైజాగ్ జిల్లా రైట్స్ మాత్రమే ఇచ్చి అగ్రిమెంట్‌కు తూట్లు పొడిచారు అని సతీష్ ఆరోపించారు.

ఏజెంట్ రిలీజ్ తర్వాత మే 1వ తేదీన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫీస్‌కు వెళ్లి గరికపాటి కృష్ణ కిషోర్, అనిల్ సుంకరతో మాట్లాడాం. ఏజెంట్ సినిమాకు ఫైనాన్స్ సమస్యలు ఎదురయ్యాయి. సినిమా డిజాస్టర్ అయింది. మీకు అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పి లెటర్ ఇచ్చారు. దాంతో డబ్బులు వస్తాయని నేను వైజాగ్ వెళ్లిపోయాను. ఆ తర్వాత నాకు వారు సామజవరగమన వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చారు. దాంతో కొంత డబ్బు కవర్ అయింది. మిగితా డబ్బు కోసం వారిని సంప్రదిస్తే సమాధానం ఇవ్వడం మానేశారు అని సతీష్ ఆరోపించారు.
ప్రస్తుతం భోళా శంకర్ సినిమా రిలీజ్ కాబోతున్నది. వారితో సంప్రదింపులు జరపాలని చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. 24 రోజుల్లో డబ్బు తిరిగి ఇస్తామని చెప్పి మాట తప్పారు. నాకు అన్యాయం జరగిందని భావించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకు వెళ్లడం జరిగింది. గతంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌తో చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎప్పుడూ ఇలాంటి సమస్యలు, మోసాలు జరగలేదు అని సతీష్ తన ప్రకటనలో తెలిపారు.

ఏజెంట్ సినిమాకు సంబంధించిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతోపాటు నాపై ఫోర్జరీ చేశాననే నింద, ఆరోపణలు చేశారు. డబ్బులు ఎగొట్టాలనే ప్రయత్నం వారిలో నాకు కనిపిస్తున్నది. గతంలో యూరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో వారిపై ఆ సంస్థ కేసులు పెట్టింది. అలాగే ఇంకా చాలా మందిని మోసం చేస్తూ మార్కెట్‌లో వారు గుడ్‌విల్ పొగొట్టుకొన్నారు. నా నీతి, నిజాయితీ ఏమిటో తెలుసు అని సతీష్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ అవుతున్నది. అందుచేత నేను ఎలాంటి వివాదం చేయకూడదని ఆచితూచీ స్పందించాను. కానీ నాపై ఎప్పుడైతే ఫోర్జరీ నింద వేసి.. ఆ వార్తలను గ్రూపుల్లో సర్కులేట్ చేస్తున్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేను నా న్యాయవాది తరఫున కోర్టును ఆశ్రయించాను. త్వరలో ఫైనాన్సియర్స్‌పై ఈడీకి ఫిర్యాదు చేస్తాం. కోర్టులో విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది అని సతీష్ తెలిపారు.


Click it and Unblock the Notifications











