ఆహ్మదాబాద్ విమానం ప్రమాదంలో డైరెక్టర్ మృతి.. 10 రోజులకు వీడిన మిస్టరీ!
జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్‌పోర్ట్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో పడటంతో మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇదే ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా దుర్మరణం పాలయ్యారు.
10 రోజులైనా కనిపించని ఆచూకీ
విమాన ప్రమాదం జరిగిన నాటి నుంచి మహేశ్ జీరావాలా అనే ఓ యువ మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టర్ కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. విమాన ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశానికి దగ్గరలోనే ఆయన ఫోన్, యాక్టీవా స్కూటర్ కనిపించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. ప్రమాదం జరిగిన రోజు నుంచి తన భర్త కనిపించడం లేదంటూ అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాలను సైతం సేకరించారు.

మ్యూజిక్ ఆల్బమ్స్‌తో ఫేమస్
గుజరాత్‌లోని నరోదాకు చెందిన మహేష్ జీరావాలా అసలు పేరు మహేష్ కలవాడియా. ఈయన పలు ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌కు దర్శకత్వం వహించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే 2019లో కాక్‌టెయిల్ ప్రేమి పాగ్ ఆఫ్ రివెంజ్ అనే గుజరాతీ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌కు నిర్మాతగానూ వ్యవహరించారు. మహేష్ కలవాడియాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరిన్ని సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌కు ప్రణాళికలు రూపొందిస్తున్న సమయంలో మహేశ్ అదృశ్యమయ్యారు.
ఇంటికి వచ్చేస్తున్నానని ఫోన్
జూన్ 12 గురువారం నాడు తనకు మీటింగ్ ఉందని మహేశ్ బయటికి వెళ్లారని ఆయన భార్య పోలీసులకు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 1.14 గంటలకు మీటింగ్ పూర్తయ్యిందని, ఇంటికి బయల్దేరుతున్నట్లు తనకు ఫోన్ చేసి చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పాటు మహేశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చినట్లు భార్య చెప్పారు. ఆ వెంటనే ఎయిరిండియా విమాన ప్రమాదం గురించి తనకు తెలిసిందని.. పోలీసులకు కూడా తన భర్త మరణంపై ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
డీఎన్ఏ టెస్ట్‌తో వీడిన మిస్టరీ
రంగంలోకి దిగిన పోలీసులకు అతని ఫోన్ సిగ్నల్స్.. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి 700 మీటర్ల దూరంలోనే కనిపించింది. ఎంతకీ మహేశ్ ఆచూకీ లభించకపోవడంతో ఆయన విమాన ప్రమాదంలో మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే మహేశ్ కుటుంబ సభ్యులు మాత్రం దీనిని విశ్వసించలేదు. అసలు ఆయన ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. కానీ పోలీసులు నిర్వహించిన డీఎన్ఏ టెస్ట్‌లో ఓ మృతదేహం మహేశ్‌దేనని తేలింది. దీంతో దర్శకుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మిస్సింగ్ మిస్టరీ విషాదంగా నిలిచింది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











