పవన్ కొత్త సినిమాలో మరో హీరోయిన్: అతడి కోసమే ఆమెను దించుతున్నారు
మల్టీస్టారర్‌గా వచ్చి మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలయికలో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే అధికారికంగా ప్రారంభం అయిన ఈ సినిమాలో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఆమెనే కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, మరో హీరో రానా దగ్గుబాటికి జోడీగా కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్‌ను ఫిక్స్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. జనవరి మొదటి వారం నుండి 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. మొదటి షెడ్యూల్‌లోనే ఇద్దరు హీరోయిన్లు పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది.

ఇద్దరు ఇగో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే పోరాటం ఆధారంగా 'అయ్యప్పనుమ్ కోషియం' సినిమా రూపొందింది. కోషీ కురియన్‌గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ఎస్సై అయ్యప్పన్ నాయర్‌గా బిజూ మీనన్ నటించారు. పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అందుకే దీన్ని అన్ని బాషల్లో రీమేక్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ - రానా కాంబోలో దీన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











