అజయ్ దేవగన్ భారీ స్కెచ్.. సీఎం రేవంత్ రెడ్డితో భేటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుములతో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎంను ఆయన అధికారికంగా కలుసుకొన్నారు. దేశ రాజధానిలో జరిగిన వీరి భేటి అత్యంత చర్చనీయాంశమైంది. అయితే ఈ ఇద్దరి భేటి వెనుక భారీ ప్రణాళిక ఉంది. అజయ్ దేవగన్ హైదరాబాద్‌లో ఫిలిం సిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కలిసినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ భేటి వెనుక అసలు విషయం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి కల్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. టాలీవుడ్‌ను ఇంటర్నేషనల్ సినిమాకు అడ్డగా నిలిచేలా ఉండాలని ఆయన ఇటీవల పలు సందర్భాల్లో తన మనసులోని మాటను వెల్లడించారు. హాలీవుడ్ సినిమాను ఇక్కడికి రప్పించే విధంగా కృషి చేయాలని సినీ వర్గాలను కోరారు. తెలుగు సినిమా అభివృద్ది తన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. సీఎం పిలుపు మేరకు పలు సినీ వర్గాలు స్పందించేందుకు సిద్దమవుతున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పిలుపుకు స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తన స్నేహితుడితో కలిసి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో ఇంటర్నషనల్ ఫిలిం సిటీ నిర్మించాలని ఉందనే ప్రతిపాదనను ఆయన ముందు ఉంచినట్టు తెలిసింది. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం. అయితే వీరి భేటిలో ఏం జరిగిందనే విషయంపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
తెలంగాణను ప్రపంచ సినిమాకు హబ్‌గా ఏర్పాటు చేయాలని ఉంది. ఇండియా, అంతర్జాతీయ సినిమా రంగాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చవచ్చు. వీఎఫ్ఎక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కూడిన ఓ ఫిలిం సిటిని ఏర్పాటు చేయాలని ఉంది. ఈ ఏర్పాటు వలన ఔత్సాహిక సినీ వర్గాలు, కంటెంట్ క్రియేటర్లకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి అని సీఎంకు అజయ్ దేవగన్ వెల్లడించినట్టు తెలిసింది. తాము ప్రతిపాదించే ఫిలిం సిటీ గురించి అన్ని వివరాలను క్లారిటీతో వెల్లడించారు. దానికి సీఎం కూడా సమ్మతించారు. సీఎం తన అభిప్రాయాలను, విజన్‌కు ఈ భేటీలో వివరించినట్టు తెలిసింది. ఫిలిం సిటీ ఏర్పాటు విషయం తెలుగు సినిమా పరిశ్రమలో భారీ చర్చకు దారి తీసింది.
ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ ఏర్పాటులో భాగంగా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి, వారికి అవసరమైన ట్రైనింగ్ ఇవ్వడానికి ఓ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తన ప్రతిపాదనలో వెల్లడించారు. అయితే అజయ్ దేవగన్ ప్లాన్స్‌కు సీఎం సానుకూలంగా స్పందించారు. అజయ్ దేవగన్ విజన్‌కు సహకారం అందిస్తామని చెప్పినట్టు తెలిసింది.
తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్దికి, తెలంగాణ సినిమా పురోగతికి సహకరించే వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. డిజిటల్ కంటెంట్ క్రియేషన్‌కు, ఇంటర్నేషనల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా తెలుగు సినిమా పరిశ్రమ మారాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. అలాగే కొత్త టాలెంట్‌ను వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











